
ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి తమ స్వార్ధ రాజకీయాల కోసం పాలన సాగిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ విమర్శించారు. శనివారం స్థానిక ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన హక్కులు, చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నా వైసిపి, టిడిపి ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. ప్రజా సమస్యలపై ఎజెండాలను పక్కనపెట్టి కేవలం బటన్ నొక్కుతూ వైనాట్ 175 అని జగన్ అంటుంటే, మరోవైపు టిడిపి కేసుల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుందని విమర్శించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాల్లేక 340 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నాయని తెలిపారు. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. జిఒ 3ను రద్దు చేశారని, 200 మంది సవరభాషా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కరువైందని అన్నారు. అంగన్వాడీ, గ్రీన్ అంబాసిడర్లకు నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, మందులు లేక ప్రజలకు వైద్యం అందని పరిస్థితి ఉందన్నారు. పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసి గిరిజన విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు నిత్యవసరాలైన పెట్రోల్, గ్యాస్, పప్పు దినుసులు, కూరగాయల ధరలు అమాంతంగా పెంచుకుపోతున్నారన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగంపై భారం వేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధపడటం విచారకరమన్నారు. కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు, లాబేసు వంతెన నిర్మాణం నేటికీ పూర్తి చేయలేదని, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు అభివృద్ధికి నోచుకోక పంట పొలాలకు సాగునీరందడం లేదని అన్నారు. ఏనుగుల సమస్య ఎన్నో ఏళ్లగా ఉన్నా పరిష్కరించలేదన్నారు. డోలి మోతలు నేటికీ కొనసాగుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రలు
అసమానతుల లేని అభివృద్ధి కోసం ఈనెల 30 నుంచి సిపిఎం ప్రజా రక్షణ భేరి పేరుతో మూడు బస్సు జాతాలు నిర్వహిస్తున్నట్లు సుబ్బరావమ్మ తెలిపారు. సీతంపేటలో (గిరిజనుల సమస్యలపై), కర్నూలు జిల్లా ఆదోని (వ్యవసాయ కార్మికుల సమస్యలపై), శ్రీకాకుళం జిల్లా మందసలో (పారిశ్రామిక రంగ సమస్యలపై) బస్సు యాత్రలు ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. సీతంపేటలో బస్సు జాత ప్రారంభించిన రోజే కురుపాంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని అన్నారు. అనంతరం నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభతో జాతా ముగుస్తుందని తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలక అవినాష్, జిల్లా కమిటీ సభ్యులు మండంగి రమణ, కోరాడ ఈశ్వరరావు, సిఐటియు నాయకులు కె గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.