ప్రజాశక్తి-పాడేరు:ఐటీడీఏ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 24వ రోజు బుధవారం కొనసాగాయి. ఎట్టకేలకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఐ.కొండలరావు, సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులను ఐటీడీఏలో చర్చలకు ఆహ్వానించారు. ఈ మేరకు 13 డిమాండ్లపై రెండు గంటలసేపు ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులతో చర్చలు నిర్వహించారు, 13 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులతో చర్చించిన డిమాండ్లను ఉన్నత అధికారులతో చర్చిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కూడ రాధాకృష్ణ, కో కన్వీనర్ ప్రభుదాసు మాట్లాడుతూ, తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని అధికారులకు తెలిపినట్లు చెప్పారు. గిరిజన విద్యార్థుల వరస మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మరణాలు అరికట్టేందుకు తక్షణమే హెల్త్ అసిస్టెంట్‌లను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.పాడేరు ఐటీడీఏ పిఓ ను తక్షణమే సరెండర్ చేయాలని, పెదబయలు తహసీల్దార్ ఆత్మహత్యపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పీవోను రక్షించడం కోసం అమాయక ఉద్యోగులను బలి చేయడం సరికాదని వారి సస్పెండ్‌ను తక్షణమే ఎత్తివేయాలన్నారు. గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్కులర్‌ను తక్షణమే రద్దు చేయాలన్నారు.










