ప్రజాశక్తి - కలెక్టరేట్ : కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం స్థానిక సుందరయ్య భవనం నుంచి పాతబస్టాండ్ వరకూ బైక్ ర్యాలీ జరిగింది. ప్రజాసంఘాల ఆధ్వర్యాన జరిగిన ఈ బైక్ ర్యాలీని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో మోడీ నాయకత్వంలో బిజెపిని ఓడించాలని ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బిజెపి అధికారం చేపట్టిన తర్వాత కార్పొరేట్లకు దాసోహమై దేశంలోని కార్మికులను, రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని విమర్శించారు. రైతులు పండించే పంటలపైన కార్పొరేటలకు పెత్తనం అప్పజెప్పి నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదలకు బిజెపి కారణమైందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థ లైన స్టీల్ ప్లాంట్, రైల్వే, రక్షణ రంగం, ఇలా అన్ని రంగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు అందకుండా బిజెపి చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా బిజెపి తన విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రమాదాన్ని గుర్తించి రాబోయే ఎన్నికలలో బిజెపి, దాని మిత్ర పక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. మణిపూర్‌లో తెగల మధ్య మతచిచ్చు రేపి అక్కడి గిరిజన ప్రాంతంలో ఖనిజాలను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేయాలని, అందులో భాగంగానే మహిళలను నగంగా ఊరేగించడంతో దేశ ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రెడ్డి వేణు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు, పట్టణ సంక్షేమ సంఘం నాయకులు ఎస్ ఉమా, విఆర్‌ఎ సంఘం నాయకులు కష్ణ, సుదర్శన, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రాయిపల్లి రాము, కెవిపిఎస్ నాయకులు సింహాచలం, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గరుగుబిల్లి : క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో మోడీ నాయకత్వంలో బిజెపిని ఓడించాలని మండల కేంద్రంలో మంగళవారం ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ రైతులు పండించే పంటల పైన కార్పొరేట్లకు పెత్తనం అప్పజెప్పి నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదలకు బిజెపి కారణమైందని విమర్శించారు. కార్మికుల హక్కులు హరించే చట్టాలను మార్చి కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా బిజెపి చేస్తుందని విమర్శించారు. బిజెపి ప్రమాదాన్ని గుర్తించి రాబోయే ఎన్నికలలో బిజెపి. దాని మిత్ర పక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు దాసరి వెంకట నాయుడు, బాబురావు, జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.










