
ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు, అనంతరం నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారాన్ని స్థానిక గుజ్జనగుండ్ల సెంటర్‌లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నళినీకాంత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ప్రజా ప్రణాళికను విడుదల చేసి ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వంత పాడుతున్నాయని, పట్టణ సంస్కరణల పేరుతో చెత్త పన్ను విధింపు, ఆస్తిపన్ను పెంచి భారం మోపారని అన్నారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలు మోపారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపి పట్ల రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన అంటకాగుతున్నాయని దుయ్యబట్టారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 15న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలు వేలాదిగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఎ.చిష్టీ, నగర కార్యదర్శివర్గ సభ్యులు బి.ముత్యాలరావు, కె.శ్రీనివాసరావు, నగర కమిటీ సభ్యులు ఆది నికల్సన్, షేక్ ఖాసింవలి, బి.సత్యనా రాయణ, నగర నాయకులు షేక్ బాషా సుభాని, ఆంజనేయులు పాల్గొన్నారు.
టింబర్ ముఠా కార్మికులతో సభ..
స్థానిక మస్తాన్‌దర్గా వద్ద గల టింబర్ ముఠా కార్మికులతో నిర్వహించిన సభలో సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్ ప్రసంగిచంచారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, లీటర్ పెట్రోలు రూ.60కి, డీజిల్ రూ.50లు, వంటగ్యాస్ 400లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగే బహిరంగ సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ప్రజాశక్తి - దుగ్గిరాల : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర రాయలసీమ నుండి బయలుదేరి 9న మంగళగిరికి వస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు తెలిపారు. మంగళగిరితో యాత్రను, విజయవాడలో 15న నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు మండలంలోని చిలువూరులో బుధవారం కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం చేపట్టారు. స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బొమ్మ సెంటర్లో జరిగిన సమావేశంలో అప్పారావు మాట్లాడుతూ చిలువూరులో ఎస్సీలకు శ్మశాన స్థలం లేక అవస్థ పడుతున్నారని, సత్వరమే భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. తుమ్మపూడిలో తాగునీటి పైపులేసి 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ నీరు సరఫరా చేయలేదని, మాస్ట్రిన్ సామాజిక తరగతి వారికి కుల ధ్రువపత్రాలు ఇవ్వకుండా నెలల తరబడి ఆర్‌డిఓ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. వీరికి తహశీల్దార్ ద్వారానే ధ్రువపత్రాలు ఇవ్వాలన్నారు. రేవేంద్రపాడు వద్దమద్రాస్ కాల్వపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందోనని ప్రజల ఆందోళన చెందుతున్నారని, వెంటనే బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు నాయకులు కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తెనాలి రూరల్ : విజయవాడలో 15న జరిగిగే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కె.బాబుప్రసాద్ కోరారు. ఈ మేరకు పోస్టర్‌ను చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆవిష్కరించారు. షేక్ హుస్సేన్‌వలి, పి.జోసెఫ్, జి.వెంకట సుబ్బయ్య, ఎం.సాంబశివరావు, ఎస్.ఏసేబు, జి.రాంబాబు, డి.పవన్‌తేజ, డి.వర్ధన్, డి.శంకర్, బి.నాగేశ్వరరావు, కె.రాజేష్, కె.వెంకట్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పెదనందిపాడు రూరల్ : నాగులపాడు, వరగాని, పెదనందిపాడులో ప్రచారాన్ని సిపిఎం మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు ప్రారంభించారు. బిజెపి పాలనలో దేశం అస్తవ్యస్తంగా తయారైందని, స్త్రీలు, మైనార్టీలు, అణగారిన వర్గాలకు రక్షణ కరువైందని చెప్పారు. వ్యవసాయ కునారిల్లుతూ ప్రజలకూ ఉపాధి కరువైందన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్తోందని చెప్పారు. రూపాయికే యూనిట్ విద్యుత్‌ను, రూ.400కే గ్యాస్ సిలిండర్‌ను, రూ.60కే లీటరు పెట్రోలును ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలని, అర్హులందరికీ రూ.5 వేల పింఛనివ్వాలని, ఇల్లులేని పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం అందించాలని కోరారు. చెత్త పన్నును రద్దు చేయాల న్నారు. రాజధానిగా అమరావతినే కొనసా గించాలని కోరారు. ఈ అంశాలతోపాటు అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరాడుతోందని, ఆ ఉద్యమాల్లో ప్రజలు కలిసి రావాలన్నారు. ఎం.వెంనటే శ్వర్లు, సిహెచ్.యానాదులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మేడికొండూరు : స్థానిక ఇందిరా కాలనీలో సిపిఎం నాయకులు ప్రచారం చేపట్టారు. కరపత్రాలను పంపిణీ చేశారు. సిపిఎం నాయకులు బి.రామకృష్ణ, సిహెచ్ చిన్న, శౌరి, శ్రీనివాసరావు, పి.లూర్థు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసరాలను తగ్గించడంతో పాటు గ్యాస్, పెట్రోల్ ధరలను నియంత్రించాలని కోరారు. సిపిఎం ప్రజా రక్షణ భేరి సందర్భంగా ఈ నెల 15న చలో విజయవాడకు స్కీమ్ వర్కర్లు తరలిరా వాలని కోరారు. బుధవారం ప్రకాష్ నగర్‌లోని సిఐటియు కార్యాలయంలో స్కీమ్ వర్కర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్రాంతమ్మ, సుగుణ, లక్ష్మి, మరియమ్మ, జ్యోతి పాల్గొన్నారు.