Jul 17,2023 20:58

ప్రజా సమస్యలు పరిష్కరించండి

రాయచోటి టౌన్‌ : రాజకీయ నాయకులు గడప గడపకూ కార్యక్రమంటూ ప్రచారం నిర్వహించుకోవడం కాదనీ, ప్రజా సమస్యలు పరిష్కారంపై చొరవ చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని మహ బూబ్‌ నగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమ వారం మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మురుగునీరు కాలువలు నిర్వహించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పి.శ్రీనివాసులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో అధికారులందరినీ వెంట వేసుకొని రాజకీయ ప్రచారం చేసుకుంటుంది తప్ప ప్రజా సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం పట్ల ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సిగ్గుపడాలని పేర్కొన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న మహ బూబ్‌ నగర్‌లో రమీజా మజీద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో మురుగు నీరు వెళ్లడానికి మార్గము లేకపోవడం కారణంగా ఉన్న మురుగునీటి కాలువల్లో పేరుకుపోయి, కొద్దిపాటి వర్షం వచ్చినా, ఇళ్లల్లోకి మురుగునీరు వచ్చేసే దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీటిని ప్రతిరోజు తోడి బయట పోసుకోవాల్సిన పరిస్థితి పేద ప్రజలకు ఉండడం పట్ల అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. సిపిఎం తరఫున ఆ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా కౌన్సిలర్‌ ఎవరో తెలియదని చెబుతున్నారంటే నాయకులకు ఓట్లు కోసం కాంట్రా క్టర్లకు లాభాలు చేకూర్చడం తప్ప ప్రజల సమస్యలు కనపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పట్టించుకోని పాలకులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జిల్లా కేంద్రం అభివద్ధి పట్ల స్థానిక శాసనసభ్యులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పట్టణంలో మురికి నీటి కాలువలు, రోడ్లు, నిర్మించాలని తాగునీటి సమస్య పరిష్కారం కోసం కషి చేయాలన్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. స్పందించిన కమిషనర్‌ మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో పర్యటించి సమస్యల పరిష్కారానికై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ వాసులు జాబిరున్నీష, మెహరున్నీష, చాన్‌ బీ, బావా ఫకద్దీన్‌, మహబూబ్‌నగర్‌ ప్రజలు పాల్గొన్నారు.