Apr 29,2023 23:42

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-పద్మనాభం : అన్ని పంచాయతీల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు ఎంపిపి కె.రాంబాబు ఆదేశించారు. మండల కార్యాలయంలో శనివారం ఎంపిపి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా సమీక్షించారు. ముందుగా ఐసిడిఎస్‌పై జరిగిన సమీక్షలో బి.తాళ్లవలస పంచాయతీ పరిధి బోత్సపేట గ్రామంలో అంగన్‌వాడీ భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారని ఎంపిటిసి సభ్యుడు చందక పైడినాయుడు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి అధికారులు స్పందిస్తూ నిధులు లేక పూర్తికాలేదని తెలిపారు. దీనిపై ఎంపిపి కె.రాంబాబు స్పందిస్తూ ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తిచేస్తామని చెప్పారు. నాడు-నేడు పథకం కింద ఆరు భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. నీటిపారుదుల శాఖకు సంబంధించి సమీక్ష జరుగుతుండగా రెండు చెరువుల మదుములు మరమ్మతులకు గురయ్యాయని నిధులు మంజూరుచేయాలని ఐనాడ గ్రామానికి చెందిన మామిడి శివ కోరారు. గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఎఇ మాట్లాడుతూ, అన్ని గ్రామాలో లబ్ధిదారులు ఇళ్లు పూర్తిచేయాలని, వారం రోజుల్లో బిల్లులు వస్తున్నాయని చెప్పారు. రోడ్డు భవనాలు శాఖ సమీక్షలో ఐనాడ గ్రామానికి చెందిన మామిడి శివ రేవిడి నుంచి ఐనాడ వరకు రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. ఇదే సమయంలో ఎంపిపి కె రాంబాబు మాట్లాడుతూ, అనంతవరం నుంచి గంధవరం రోడ్డులో పెంట గ్రామం నుంచి కొవ్వాడ వరకు పూర్తిగా శిథిలమైరదని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పద్మనాభం నుంచి రెడ్డిపల్లి రోడ్డు పనులు నత్తనడక సాగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు పనుల సమయంలో తాగునీటి పైపులైన్‌ పాడైపోయిందని, దీంతో తాగునీటికి రెడ్డిపల్లి గ్రామస్తులు ఇబ్బందులుపడుతున్నారని, మరమ్మతులు చేపట్టాలని రెడ్డిపల్లి ఉప సర్పంచ్‌ ఎస్‌.ఆదిబాబు కోరారు. వైద్యశాఖ సమీక్షలో వైద్యాధికారి స్వప్న వివరాలు అందించారు. ఆర్‌టిసిపై సమీక్షలో ఎంపిపి రాంబాబు మాట్లాడుతూ, కొవ్వాడ బస్సును పునరుద్ధరించారని, దీనిని గంధవరం వరకు పొడిగించాలని, పద్మనాభం నుంచి బీమిలి షటిల్‌ సర్వీసు బస్సులు నడపాలని కోరారు. ఈ సమావేశానికి విద్య, అటవీ, పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారులు హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎం.విజయకుమార్‌, తహశీల్దార్‌ శ్రీవల్లీ, వైస్‌ ఎంపిపి ఈర్ల రాజేశ్వరి, వైసిపి మండల అధ్యక్షులు కె.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
భూమి ఇచ్చిన రైతుకు న్యాయం చేయాలి : ఎమ్మెల్యే
ప్రభుత్వానికి భూమి ఇచ్చిన ప్రతి రైతుకూ న్యాయం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశించారు. మండల సమావేశం ముగిసిన సమయంలో వచ్చిన ఆయన అధికారులతో మాట్లాడారు. సచివాలయాల సిబ్బంది పని తీరు, వాలంటీర్ల పనిని పరిశీలించి మే 10వ తేదీకి నివేదిక ఇవ్వాలని ఎంపిడిఒ ఎం విజయకుమార్‌ను ఆదేశించారు. జాతీయ పంచాయతీ దినోత్సవం నేపథ్యంలో సర్పంచులను సత్కరించారు.