ప్రజా సమస్యలపై ఉద్యమం : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూర్
ఆత్మకూరు పట్టణంలోని 24వ వార్డులలో నెలకొన్న అపరిష్కృత ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసు రత్నం, పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్‌లు తెలిపారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు మున్సిపాలిటీ గ్రేడ్-2 అయిన తర్వాత పొయ్యిలో నుండి పెనంలోకి పడినట్లుగా మారిందన్నారు. పట్టణంలో ఏ వీధిలోకి పోయినా చిన్న పాటి వర్షానికి రోడ్లు చేపల చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. పట్టణంలో అనేక వీధిలలో సిమెంట్ రోడ్లు, 24 వార్డులలో డ్రెయినేజీ సిస్టం లేక ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీరు ఆగి దోమలు వ్యాప్తి చెంది ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. దోమల నివారణకు పట్టణంలో ఫాగింగ్ చర్యలు చేపట్టడం లేదని, పట్టణంలో వీధి కుక్కలు చిన్నారులపై, వృద్ధులపై దాడి చేస్తున్నా మున్సిపాల్టీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. వీధులలో ప్రజలు తిరగాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. పట్టణ ప్రజలకు దాహార్తి తీర్చాలని రూ.116 కోట్లతో ప్రారంభించిన స్కీము నీటిట్యాంకులు మొండి గోడలుగా మిగిలాయి తప్ప సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. మున్సిపాలిటీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రజలపై భారాలు ఎలా వేయాలి, వసూలు చేయాలనే దానిపైన చూపిన శ్రద్ధ సమస్యలపై లేదన్నారు. కనీసం మౌలిక సదుపాయాలు తీర్చడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణంలోని 24వ వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ే పట్టణ ప్రజలను సమీకరించి సిపిఎంగా మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ నాయకులు ఎన్.స్వాములు, ఏ.సురేంద్ర, డి.రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.










