ప్రజాశక్తి-చింతూరు
కీర్తిశేషులు కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదని, ఆ మహానాయకుడి ఆశయ సాధనకు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్ అన్నారు. కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 27వ వర్థంతిని పురస్కరించుకొని బుధవారం చింతూరులోని సిపిఎం కార్యాలయంలోనూ, ఏడుగురాళ్లపల్లి అమరజీవి స్థూపం వద్ద వెంకటరెడ్డి చిత్ర పటాలకు సీసం సురేష్, సిపిఎం సీనియర్ నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏడుగురులపల్లిలో జరిగిన వెంకటరెడ్డి సంతాప సభలో సీసం సురేష్ మాట్లాడుతూ సిపిఎం, ఎర్రజెండా, అమరవీరుల త్యాగాలతోనే ఈ ప్రాంతంలో రోడ్లు, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించబడ్డాయని తెలిపారు. నేటి పాలకులు ఈ ప్రాంతానికి ఏ అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. తనకు నక్సలైట్ల నుండి ప్రాణ హాని ఉందని తెలిసినా వెంకటరెడ్డి ఎక్కడా వెనకాడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మల్లంపేట నుండి చింతూరు కేంద్రంలో నిరంతరం పోరాటాలు నిర్వహించారని తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేసి, ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయి తప్ప తుపాకితోనూ, హత్యలతోనూ సాధ్యం కాదని, ప్రజల ఆలోచన దిశగా ఉండాలని ఆయన చైతన్యం చేశారని చెప్పారు. 13 ఏళ్లు పాటు హిట్ లిస్ట్‌లో ఉన్న వెంకటరెడ్డిని కాపు కాసి కత్తులతో దాడి చేసి హత్య చేశారని పేర్కొన్నారు. నరహంతక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేమని సిగ్గుతో తలదించుకున్న నక్సలైట్లు నేడు ప్రజలకు దూరంగా అడవుల్లో ఉంటున్నారని తెలిపారు. అమరజీవులు బత్తుల భీష్మారావు, బండారు చందర్రావు, పులి రామయ్య, అడివి ముకయ్య, సున్నం రాజయ్య, కుంజ బొజ్జి, వెంకటరెడ్డి వంటి అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.










