ప్రజా సమస్యలపై మాట్లాడితే కేసులు
- అక్రమ కేసులకు భయపడేది లేదు
- తామూ ప్రయివేటు కేసులు వేసేందుకు సిద్ధం
- ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక
ప్రజాశక్తి-కావలి : ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి నిరసనలు తెలిపితే అధికారులు అక్రమంగా కేసులు బనాయించడం దుర్మార్గాపు చర్య అని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు పేర్కొన్నారు. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆ అధికారులపై తాము కూడా ప్రయివేటు కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వేదిక కన్వీనర్ కరవది భాస్కర్ (సిపిఐఎంఎల్), వేదిక సభ్యులు చింతాల వెంకట్రావు (కాంగ్రెస్), పసుపులేటి పెంచలయ్య (సిపిఎం), జ్యోతి బాబురావు, దేవకుమార్ (టిడిపి), అళహరి సుధాకర్ (జనసేన), బలిజేపల్లి వెంకటేశ్వర్లు (సిపిఐ), పసుపులేటి వెంకటేశ్వర్లు, పిఎస్‌ఆర్ ట్రస్ట్ సభ్యులు హెచ్చరికలు చేశారు. బుధవారం పట్టణంలోని జర్నలిస్టుక్లబ్‌లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కావలి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం వస్తున్న ప్రతిపక్షాలపై అధికారులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ చేస్తున్న అవినీతి దోపిడీలపై చర్యలు తీసుకోకపోగా వాటిని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయించడం విచారకరమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడడం, సమాజంలో జరుగుతున్న అవినీతి దోపిడీలపై ప్రశ్నించడం ప్రతిపక్షాలుగా తమ విధి అన్నారు. అయితే అటువంటి తమపై అధికారులే కక్షపూరితంగా కేసులు బనాయించడం దోపిడిని, అవినీతిని సమర్థించడమేనని అన్నారు. సహజ వనరులను దోపిడీ చేస్తున్న, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న, దళితులపై దాడులు చేస్తున్న వారికి అధికారులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు. దోపిడీకి అవినీతికి పాల్పడుతున్న వారి నుండి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని ప్రజలు, ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన అధికారులు దోపిడీదారులకు అవినీతి పరులకు అండగా ఉండడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని తెలియజేశారు. అధికార పార్టీ రెచ్చగొట్టే విధంగా ప్లెక్సీలు ఏర్పాటు చేసి, దానిని తొలగించమని అడిగితే అధికారులు స్పందించకపోతే ఎదుట వారు ఫ్లెక్సీ వేశారని, వారిపై కేసులు బనాయించటం సిగ్గు చేటన్నారు. అలానే ఫ్లెక్సీలు కట్టుకొని పోస్టర్లు అంటించుకుని జీవనం సాగించే దళిత కూలీలపై అక్రమంగా కేసులు బనాయించి, విచక్షణా రహితంగా చావబాది, దోపిడీదారుల అవినీతిపరుల మెప్పుపొందడం అమానవీయమన్నారు. చివరకు కావలి ఎంఎల్‌ఎ తన స్థాయిని మరిచి దిగజారి కూలీలపై అక్రమకేసులు పెట్టించి పోలీసులతో చితక బాదించిన వైనం క్షమించరానిదని అన్నారు. తక్షణమే దళిత కూలీలపై విచక్షణారహితంగా చావబాదిన పోలీస్ అధికారులపై, అక్రమకేసులు బనాయించిన మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు, ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళిత కూలీలు అవమానంగా భావించి వారు ఏమైనా చేసుకోకూడనిది ఏమైనా చేసుకుంటే అందుకు కావలి ఎంఎల్‌ఎ, పోలీసు, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దళితులను వేధించడం ఆత్మహత్యకు పాల్పడేటట్లుగా చేయడం, ఆత్మహత్య చేసుకునేలా వేధించడం పోలీస్ అధికారులకు ఆనవాయితీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ దోపిడీకి అవినీతికి వత్తాసు పలికిన అనేకమంది ఐఎఎస్ అధికారులే జైళ్ల పాలైన విషయాలను కావలి అధికారులు దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలని హితువు పలికారు. కావలి ఎంఎల్‌ఎ చేస్తున్న సహజవనరుల దోపిడీ, అవినీతి దళితులపై దాడులుకు వత్తాసు పలుకుతున్న అధికారులు కావలికి పెద్ద శాపంగా మారారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలకు వేదిక సిద్ధపడుతుందన్నారు. సమావేశంలో సిపిఐ కార్యదర్శి నాగరాజు, టిడిపి నాయకులు నారాయణ, సునీల్, వేణు, సయ్యద్ అబ్దుల్ హఫీజ్, జనసేన నాయకులు గడే నాగార్జున, ప్రవీణ్, తదితరులున్నారు.










