Dec 20,2022 00:09

మాట్లాడుతున్న ఎంపీపీ

ప్రజాశక్తి-మాడుగుల:మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పెదబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సమస్యల పట్ల తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించారు. తొలుత సమావేశం ప్రారంభం కాగానే ఎం.కోడూరు సర్పంచ్‌ గొల్లవిల్లి సంజీవరావు మాట్లాడుతూ, ఇన్నాళ్ళూ జరిగిన సమావేశాలలో సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రశ్నించడం జరిగిందని, దీనికి ఏ విధమైన చర్యలు చేపట్టారో అధికారులు చెప్పాలని పట్టుపట్టారు. అనేక శాఖలకు చెందిన అధికారులు సమావేశాలకు హాజరు కాకపోయినా మనం ఏమి చేశామని తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు. దీనిపై మండల పరిషత్‌ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు అనంతరం వ్యవసాయ శాఖ కు సంబంధించి చర్చరాగానే అనేక మండలాలలో ధాన్యం కొనుగోలు ఇప్పటికే ప్రారంభం అయ్యిందని మాడుగుల మండలంలో ఇంతవరకు ధాన్యం కొనుగోలు ఎందుకు ప్రారంభించలేదని సంజీవరావు తీవ్రంగా ప్రశ్నించారు. గోనె సంచులు సిద్ధం అయ్యాయా అని ప్రశ్నించగా, అన్ని పిఏసిఎస్‌ కేంద్రాలకు పంపించామని మండలంలో 14 వేల గోనె సంచులు సరఫరా చేశామని మండల వ్యవసాయ శాఖ అధికారి వాసుదేవరావు సమాధానం ఇచ్చారు. దీనిపై ఎం.కోడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఇంతవరకు గోనె సంచులు పంపలేదని, ఇటువంటి తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదని సంజీవరావు తీవ్ర అక్రమ వ్యక్తం చేశారు. తేమ శాతం నిర్ధారణ యంత్రాలు సరిగ్గా పని చేయలేనప్పుడు ముందుగా వాటిని ఎందుకు సరి చేయలేదని ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సంబంధిత శాఖ ఎటువంటి చర్యలు చేపట్టక పోవడం విచారకరమన్నారు.
అనంతరం గృహ నిర్మాణ శాఖకు సంబంధించి చర్చ రావుగానే మండలంలో అనేక గ్రామాలలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా ఎం.కోడూరులో ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు. కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే వారిని ఎందుకు అరికట్ట లేకపోయారని వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి పట్టాలు మంజూరు చేస్తూ నిధులు మంజూరు చేస్తున్నా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నారని వాదించారు. వైద్యశాఖకు సంబంధించి ఎంఎల్‌హెచ్‌పీ సిబ్బంది గ్రామాలలో ఏ విధులు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఎం.కోటపాడు సర్పంచ్‌ సేనాపతి శేషు ఫణి గంగాధర్‌ మాట్లాడుతూ, ఈ సిబ్బంది మండలంలో అనేక గ్రామాలలో ఎటువంటి పనులు నిర్వహించలేదన్నారు. వైస్‌ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాస్‌ ట్లాడుతూ, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గాదిరాయి సర్పంచ్‌ పెంటకోట జగన్నాధ రావు మాట్లాడుతూ ఈ సిబ్బంది విషయం ఇంతవరకు తనకే తెలియదని విమర్శలు చేశారు. సమావేశం ఏర్పాటు చేయాలని వైస్‌ ఎంపీపీ తాళపు రెడ్డి రాజారాం ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మీనా కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.