ప్రజాశక్తి -గాజువాక : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాలక వర్గాల దృష్టికి తీసుకెళ్లడమే బస్సు యాత్ర ప్రధాన లక్ష్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా గాజువాక లయన్స్ క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం ప్రారంభమైన బస్సు యాత్ర రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తిరుగుతూ సెప్టెంబర్ 8 తిరుపతిలో ముగుస్తుందని తెలిపారు. బస్సు యాత్ర సందర్భంగా పలు జిల్లాలో ప్రజల సమస్యలపై సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై శ్రీకాకుళంలో సదస్సు నిర్వహిస్తామని, గిరిజనుల సమస్యలపై పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులలో సభలు నిర్వహిస్తామని తెలిపారు. 'రాష్ట్రాన్ని రక్షించండి - దేశాన్ని కాపాడండి' అనే నినాదంతో బస్సు యాత్ర కొనసాగించి ప్రజా పోరాటాలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, యువకులు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతతత్వాన్ని రెచ్చగొడుతూ, ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నరేంద్ర మోడీ తన అనుయూయులకు కట్టబెట్టేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోరాటాల ద్వారా ఉక్కును కాపాడు కుంటామని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవీంద్రనాథ్, సిపిఐ జివిఎంసి ఫ్లోర్ లీడర్ ఎజె.స్టాలిన్, సిపిఐ నాయకులు జి.ఆనంద్, కె.అచ్యుతరావు, ఎళ్ళేటి శ్రీనివాస్, అప్పారి విష్ణుమూర్తి పాల్గొన్నారు.










