Apr 11,2023 17:16

మండల సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ, జడ్పిటిసి, అధికారులు.

ప్రజా సమస్యలను పరిష్కరించాలి : ఎంపిపి
ప్రజాశక్తి - అవుకు

     మండలంలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపించే బాధ్యత అధికారులదేనని ఎంపీపీ చల్లా రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం అవుకు మండల పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ భవనంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో అజాం ఖాన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ చల్లా రాజశేఖర్‌ రెడ్డి, జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్‌ ప్రసాద్‌ బాబు, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ టి వినోద్‌ కుమార్‌ హాజరయ్యారు. పశు వైద్యురాలు డాక్టర్‌ భారతి దేవి, వ్యవసాయ అధికారి ప్రసాదరావు, ఆర్‌డబ్ల్యు ఎస్‌ ఏఈ కరీముల్లా, పంచాయతి రాజ్‌ ఏఈ భాషలు తమ శాఖల పరిధిలో ప్రగతి వివరాలను చదివి వినిపించారు. జాతీయ, ఆర్‌అండ్‌బి, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు హాజరు కాకపోవడంతో వారి తీరుపై మండల సభలో తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని ఎంపిడిఒకు ఎంపిపి సూచించారు. డాక్టర్‌ టి.వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు 12 గంటలకల్లా కార్యకలాపాలు ముగించుకోవాలని ఇంటికి చేరుకోవాలన్నారు. తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లాలనుకుంటే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను తీసుకెళ్లాలని తెలిపారు. చలివేంద్రంలోనే ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ప్రతి ఒక్కరికి అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవుకు పట్టణంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అదనంగా నవాజ్‌ కట్టమీద ఒక కోటి 40 లక్షలతో రెండు లక్షల 50 వేల లీటర్ల కెపాసిటీతో వైయస్సార్‌ ట్యాంకును నిర్మిస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్‌ ఎఇ తెలిపారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలం కావడంతో మట్టి నమూనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు చిరుధాన్యాలను పండించేలా చర్యలు తీసుకుంటామని, అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గోపవరం గోపాల్‌ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.