చక్రాయపేట : స్థానిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం అందించేలా మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. బుధవారం చక్రాయపేట మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వ హించారు. కార్యక్రమంలో కలెక్టర్ వి.విజరు రామరాజుతో పాటు జెసి గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పులివెందుల ఆర్‌డిఒ వెంకటేశ్వర్లు హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యలను స్థానికంగానే పరిష్క రించే దిశగా మండల స్థాయిలో ప్రతి బుధ, శుక్ర వారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కో మండలంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రధాన్యతతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామ స్థాయి సమస్యలు.. మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దష్టి సారిం చాలన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ స్పందన కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలు, ఇంటి పట్టా సమస్యలు, కరెంటు మీటర్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. ప్రజల అర్జీలకు అధికారులు అందించే పరిష్కార నివేదికలు.. స్పష్టంగా ఉండాలని.. ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో డ్వామా, డిఆర్‌డిఎ పీడీలు, డిపిఒ, ఆర్‌డబుల్యఎస్ ఎస్‌ఇ, వ్యవసాయ శాఖ జెడి, ఎపిఎంఐపి పీడీ, స్టెఫ్ సిఇఒ, ఎంపిడిఒ శివారెడ్డి, తహశీల్దార్ రాజసింహ నరేంద్ర, జడ్‌పిటిసి శివారెడ్డి, ఎంపిపి మాధవి బాలకృష్ణ, ఎడి శ్రీకాంత్‌రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ నవత్ బాబు, సురభి చక్రాయపేట పిహెచ్‌సి సిబ్బంది, జిల్లా శాఖ మండల శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.










