Oct 11,2023 21:10

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-వల్లూరు
స్థానిక సమస్యలకు స్థానికంగానే పరిష్కారం అందించేలా మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వి.విజరు రామరాజుతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, కడప ఆర్‌డిఒ ధర్మచంద్రారెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూష హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రభుత్వం అత్యంత ప్రధాన్యతతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామ స్థాయి సమస్యలు మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల అర్జీలకు అధికారులు అందించే పరిష్కార నివేదికలు స్పష్టంగా ఉండాలని ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో డిపిఒ ప్రభాకర్‌ రెడ్డి, ఎంపిడిఒ జుబేదా, తహశీల్దార్‌ శంకరరావు, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.