Jun 15,2023 01:56
వీక్షణ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, జెసి, ఎస్‌పి

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తెచ్చి, ప్రజల సమస్యలన్నింటినీ సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్లు, జిల్లా సంయుక్త కలెక్టర్లు తప్పనిసరిగా తనిఖీలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. సచివాలయాలపై పర్యవేక్షణ మరింత పెరగాలని ఆయన సూచించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై అధిక ప్రాధాన్యత చూపాలన్నారు. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జగనన్న కాలనీలలోని పక్కా గృహ నిర్మాణాలపై ప్రతివారం సమీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు. జగనన్నకు చెబుదాం, గడప గడకూ మన ప్రభుత్వం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, జగనన్న కాలనీలలోని పక్కా గృహాలు, వ్యవసాయ రంగం, జల వనరులు, జగనన్న భూహక్కు మరియు భూరక్ష (రీ సర్వే) పథకాల అమలుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. వీక్షణ సమావేశంలో కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా, జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌, సంయుక్త కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌, డిఆర్‌ఓ కె లక్ష్మీశివజ్యోతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.