Oct 30,2023 20:55

ప్రజారక్షణభేరి బస్సు యాత్రను జెండాఊపి ప్రారంభిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సుబ్బరావమ్మ

 సీతంపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బారావమ్మ అన్నారు. సిపిఎం నాయకులు చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను సోమవారం స్థానిక పార్కు సమీపాన ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఎర్రజెండాలతో సీతంపేట ఎరుపుమయమైంది. అనంతరం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి చుట్టూ రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన తిరుగుతున్నాయని, బిజెపి ఇప్పటికే రాష్ట్రాన్ని మోసగించిందని, ప్రత్యేక హౌదా ఇవ్వలేదని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా మోసం చేసిందన్నారు. వీటిపై ఈ మూడు పార్టీలు కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని నిలదీయడం లేదన్నారు. రాష్ట్రంలో ఖాళీపోస్టులు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇటీవల రైల్వే ప్రమాదాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని, ఇందుకు బాధ్యులైన కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో వైద్యమందక అనేకమంది మృతి చెందుతున్నారని వెంటనే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి నిధులు కేటాయించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం సవరభాష విద్యా వాలంటీర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి సవర డోంబు, ఆ సంఘ నాయకులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కిల్లో సురేందర్‌, మర్రాపు సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, జిల్లా కమిటీ సభ్యులు హైమావతి, మండల కార్యదర్శి భాస్కరరావు, సర్పంచులు సుందరమ్మ, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ : బిజెపికి ప్రత్యామ్నాయం రాష్ట్రంలో సిపిఎం అని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు మర్రాపు సూర్యనారాయణ అన్నారు. పాలకొండ చేరిన బస్సుయాత్రకు స్థానిక ఆటో స్టాండ్‌ దగ్గర సిపిఎం మండల నాయకులు దావాల రమణారావు, లక్ష్మణరావు, కె.రాము, ప్రభాకర్‌, అమరవేణి, తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా సంస్కరణలు తీసుకొస్తున్నా వైసిపి,టిడిపి, జనసేన వ్యతిరేకించడం లేదన్నారు. వైసిపి ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, కుట్రపూరిత చర్యలకు పాల్పడుతుందని అన్నారు. నవంబర్‌ 15న విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తామని, దీనికి పెద్ద ఎత్తున ప్రజలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు.