Sep 29,2023 21:57

ఫొటో : 'వంటా వార్పు' కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌

ప్రజా సమస్యల పరిష్కారానికి 'వంటా వార్పు'
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి 'వంటావార్పు నిరసన' కార్యక్రమం చేపట్టామని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో వంటావార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం, సిపిఐ, సిఐటియు కార్మికులతో కలిసి వంట చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్టులో నిర్వహించిన పాదయాత్రలో భాగంగా మండలంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యల పరిష్కారానికి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని తెలిపారు. అందులో ముఖ్యంగా ముదివర్తి - ముదివర్తిపాలెం మధ్య కాజ్‌వే నిర్మాణం రాజకీయ పార్టీల ఎన్నికల హామీలకే పరిమితం అవుతుందన్నారు. ఇప్పటికే సముద్రపు నీరు ముందుకు వచ్చి గ్రామాలలోని భూగర్భ జలాలు ఉప్పునీటిమయం అవుతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. ఇదే విధంగా కొనసాగితే భూములు పంటను పండించడానికి కూడా పనికిరాకుండా పోయి తాగునీరు కొని తాగే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. గతంలో కాజ్వే నిర్మాణం మొదలు పెడతామని శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. మళ్లీ 2024 ఎన్నికలలో కూడా రెండు పార్టీలు ఎన్నికల హామీగా కాజ్‌వే నిర్మాణం మారుతుందని తెలిపారు. అదేవిధంగా మైపాడు బీచ్‌లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నెల్లూరు నుండి మైపాడుకు నాలుగు లైన్ల రోడ్డును ఏర్పాటు చేయాలన్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు. స్మార్ట్‌ మీటర్‌ ఆలోచన నిలిపివేయాలని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగించాలని, విద్యుత్‌ సరఫరా బిల్లు 2022ను ఉపసంహరించుకోవాలన్నారు. గంగపట్నం గ్రామం ఈనాడు కాలనీలోని సైడ్‌ కాలవలను నిర్మించాలని డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకూరుపేట - రావూరు మధ్య లింకు రోడ్డును ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా మండలంలోని దెబ్బతిన్న పలు లింకు రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజా రవాణాకు ఆటంకం లేకుండా చూడాలని, పైసమస్యలు పరిష్కారానికి సిపిఎం పాటుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌, సిపిఎం మండల అధ్యక్షుడు మైపాటి కోటేశ్వరరావు, తిక్కవరపు ప్రభాకర్‌ రెడ్డి, మండల సిఐటియు అధ్యక్షులు ఎస్‌కె.చాన్‌బాషా, సిపిఐ రైతు సంఘం నాయకులు ఎస్‌.కె షాన్వాజ్‌, రెండు వేలు, మనోహర్‌, వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.