ప్రజాశక్తి-ఉక్కునగరం : దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా స్టీల్ సిఐటియు ఆధ్వర్యాన ఉక్కునగరం యూనియన్ కార్యాలయంలో 'మూడు దశాబ్దాల నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలు- ప్రభుత్వ రంగం- కార్మికులు- ప్రజలపై ప్రభావం' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య వక్తగా ఎంవిఎస్.శర్మ హాజరై మాట్లాడారు. పెట్టుబడిదారీ సమాజం సమస్యలను సృష్టిస్తోందన్నారు. వాటి మధ్యలో జీవనం గడుపుతూ, పరిష్కరిస్తామన్న భ్రమలను కల్పిస్తున్న రాజకీయాలను నమ్మడమే ప్రజల అమాయ కత్వమని వివరించారు. ఇదే సమయంలో సోషలిస్టు దేశాలలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. నయా ఉదారవాద విధానాల్లో విద్య, వైద్యం ప్రైవేటీకరణకు స్వాగతించి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవాలనుకోవడం ఎండమావి కోసం పరిగెత్తడం వంటిదని స్పష్టం చేశారు. మన దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి కంటే బ్రిటన్ ప్రజల కొనుగోలు శక్తి 18 శాతం ఎక్కువ, చైనాలో 5 శాతం ఎక్కువ, బ్రెజిల్‌లో నాలుగు శాతం ఎక్కువ అని తెలిపారు.
మనదేశంలో 94 శాతం యూనియన్ రహిత కార్మిక వర్గం ఉందని, కేవలం 6శాతం మాత్రమే యూనియన్ కార్మిక వర్గం ఉందని చెప్పారు. ఈ 94 శాతంలో ఐటి, ఉబర్, ఓలా, రాపిడో, జొమాటో, సిగ్గి తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారని, వారి హక్కులను యాజమాన్యాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. ఈ రంగాల్లో యువతరం ఎక్కువగా ఉందని, వారికి అర్థమయ్యేలా కార్యాచరణ రూపొందించి, వారిని పోరాటాలలోకి దించడం మనందరి ప్రధాన కర్తవ్యం కావాలని, అదే పుచ్చలపల్లి సుందరయ్యకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మృతిచెందిన ఉప్పిలి కన్నారావుకు సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జ్యోతీశ్వరరావు, నగర సిఐటియు అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్, స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, పి.శ్రీనివాసరాజు, ఒప్పంద కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, స్టీల్ సిఐటియు నాయకులు బి.అప్పారావు, కె.గంగాధర్, యు.వెంకటేశ్వర్లు, టివికె రాజు, పుల్లారావు, నీలకంఠం, కృష్ణమూర్తి, బి.తౌడన్న, భానుమూర్తి, డిసిహెచ్ వెంకటేశ్వరరావు, డిఎస్‌ఆర్‌సి.మూర్తి, ఒవి.రావు, కెపి.సుబ్రహ్మణ్యం తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, మహిళా సంఘం ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. ముందుగా ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు.










