Jun 13,2023 23:39

గాజువాకలోని ఇండోర్‌ స్టేడియాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ సాయికాంత్‌వర్మ

ప్రజాశక్తి-గాజువాక : నగరంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌వర్మ చెప్పారు. జివిఎంసి గాజువాక జోన్‌ పరిధిలోని 65, 74 వార్డుల్లోని వికాస్‌నగర్‌, బాంబేకాలనీ, దయాల్‌నగర్‌, బీసీ రోడ్డు తదితర ప్రాంతాలలో ఆయా కార్పొరేటర్లు బి.నరసింహపాత్రుడు, తిప్పల వంశీరెడ్డి లతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా 65వ వార్డులోని రాజీవ్‌స్టేడియం, రాజరాజేశ్వరి ఓపెన్‌ ఆడిటోరియం, స్విమ్మింగ్‌ పూల్‌ మరమ్మత్తులతోపాటు వికాస్‌ నగర్‌లోని పార్కు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భవనం పూర్తిగా శిథిలవస్థలో ఉన్నందున దాని ఆధునీకరణ పనులు, బాంబే కాలనీలోని కాలువల మరమ్మతులు, వికాస్‌ నగర్‌లోని గెడ్డ ఆధునికీకరణ తదితరాలు చేపట్టాలని కార్పొరేటర్‌ కమిషనర్‌ను కోరారు. దీనిపై కమిషనర్‌ స్పందిస్తూ ఇప్పటికే టెండర్‌ పనులు పూర్తయ్యాయని తెలిపారు. పనులు వెంటనే మొదలు పెట్టేలా చూడాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. వార్డులో యుజిడి గోతులను వెంటనే పూడ్చాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు.
74వ వార్డులో పర్యటిస్తూ పారిశుద్ధ నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులు వెంటనే పారిశుధ్య పనులు చేపట్టి శుభ్రంగా ఉండేటట్లు చూడాలని ఆదేశించారు. దయాల్‌నగర్‌లో పైపులైన్లు నిత్యం మరమ్మత్తులకు గురవుతున్నాయని వాటికి శాశ్వత పద్ధతిలో పనులు చేపట్టాలని, యుజిడి గోతులు పూడ్చాలని, వీధిలైట్లు సరిగా వెలగడం లేదని స్థానిక కార్పొరేటర్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకురాగా వెంటనే పనులు చేపట్టాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు.
బీసీ రోడ్డు ప్రధాన రహదారి మార్జిన్లలో భవన నిర్మాణ వ్యర్ధాలు అధికంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించి ఆ ప్రాంతానికి కంచి వేయించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన ఇంజినీరు రవికృష్ణరాజు, పట్టణ ప్రణాళిక అధికారి సునీత, జోనల్‌ కమిషనర్‌ సింహాచలం, ఎఎంఒహెచ్‌ తదితరులు పాల్గొన్నారు.