ప్రజాశక్తి-నెల్లూరు :నగర నియోజ కవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగు తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 313వ రోజున 9వ డివిజన్ నవాబుపేట నజీర్ తోటలో చేపట్టారు. గురువారం ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో విసిగి వేసారి పోయిన ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా కావాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. వారాహి విజయ యాత్రకి వస్తున్న స్పందన చూసి అధికార వైసిపికి కంటి మీద కునుకులేకుండా పోతోందన్నారు. రానున్న ఎన్నికల అనంతరం ఏది ఏమైనా సరే ప్రజలందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానున్నారని, ఇందులో తమకు ఎలాంటి సందేహాలు లేవని కేతంరెడ్డి అన్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










