ప్రజాశక్తి - టి.నరసాపురం
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు తెలిపారు. మండలంలోని బొర్రంపాలెంలో నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. పథకాలు అందరికీ అందుతున్నాయే లేదో తెలుసుకున్నారు. కొత్తగా మంజూరైన ఫించన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్‌సి కాలనీ వాసులు సీసీ రోడ్లు వేయాలని, డ్రెయినేజీలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఇంటి బిల్లులు చెల్లించాలని, రేషన్ బియ్యం సక్రమంగా అందేటట్లు చర్యలు చేపట్టాలని పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. సమస్యలపై ఆయన స్పందించి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి సభ్యులు సామంత పూడి బాల సూర్యనారాయణరాజు, ఎంపీపీ డి.లక్ష్మి, సర్పంచి కలపర్తి వెంకటేశ్వరమ్మ, ఎంపిటిసిలు తోట శ్యామల, కలపర్తి సుజాత, మాజీ ఎంపీపీ కొత్త ప్రకాష్ బాబు పాల్గొన్నారు.










