Jul 27,2022 22:50

మాట్లాడుతున్న కార్పొరేటర్‌ గంగారావు

'మీట్‌ ది కార్పొరేటర్‌'లో గంగారావు
ప్రజాశక్తి-ఉక్కునగరం
: వార్డు పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు అన్నారు. బుధవారం ఆంధ్ర కేసరి కళాక్షేత్రంలో 'మీట్‌ ది కార్పొరేటర్‌ ' కార్యక్రమంలో భాగంగా సెక్టార్‌ 8 నుంచి సెక్టార్‌12 వరకు ఉన్న ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పారిశుధ్య సమస్యతోపాటు వీధిలైట్లు, కుక్కలు, పందులు, దోమల బెడదతోపాటు పరవాడ కెమికల్‌ ఫ్యాక్టరీనుంచి వెలువడే దుర్వాసనతో నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వివరించారు.
దీనిపై గంగారావు స్పందిస్తూ, జివిఎంసి అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మహిళలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు, పోటీపరీక్షలకు విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. పార్కులలో, వీధిలైట్ల సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఉక్కునగరంలో పలు ప్రాంతాల్లో ఓపెన్‌ జిమ్‌లను, వాటిలో ఒకచోట కియోస్కీ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం స్టీల్‌ జోన్‌ కార్యదర్శి శ్రీనివాసరాజు, విసిసి కార్యదర్శి సుశీల, ఆంధ్ర కేసరి కళాక్షేత్రం కమిటీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, కెపి.సుబ్రమణ్యం పాల్గొన్నారు.