
ప్రజాశక్తి - మార్టూరు రూరల్
ప్రభుత్వ అసమర్థ, అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, పర్చూరు ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశిరావు పర్చూరు ప్రగతి ప్రతిజ్ఞ ప్రజారక్షణ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మన పల్లెకు మన"ఏలూరి" కార్యక్రమాన్ని ఈనెల 23నుండి మార్టూరు మండలంలోని రాజుగారిపాలెం నుంచి పాదయాత్ర చేయనున్నట్లు టిడిపి బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు తొండెపు ఆదినారాయణ, టిడిపి సీనియర్ నాయకులు ఉప్పలపాటి తిరుపతిరాజు తెలిపారు. మార్టూరులోని టిడిపి కార్యాలయంలో శనివారం వివరాలు వెల్లడించారు. నియోజకవర్గంలోని 95పంచాయతీలలో ఎమ్మెల్యే ఏలూరి పర్యటించనున్నట్లు తెలిపారు. గత నాలుగున్నర ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ అసమర్ధ, అరాచక, విధ్వంస పాలనపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఏలూరి పల్లె బాట పట్టనున్నట్లు తెలిపారు. టిడిపి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ గ్రామాలలో సమస్యలు తెలుసుకుంటారని, రాబోయే రోజుల్లో ఆ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వైసిపి పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధిపై ద్రుష్టి లేదన్నారు. టిడిపి ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిలిపేయడమే వైసిపి ఘనతని అన్నారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే గుంటూరు ఛానల్ పొడిగింపు పనులను రద్దు చేయడమే కాకుండా పేద ప్రజల ఆరోగ్యానికి ధీమాగా ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్‌ను సైతం రద్దుచేశారని అన్నారు. సహజ వనరులైన ఇసుక, మట్టి కొల్లగొడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో టిడిపి ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు సైతం నేటికి ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారాయని అన్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు సాగు ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. కొమ్మమూరు కాలువ పరిధిలోని కృష్ణ వెస్ట్రన్ డెల్టాలో పంట పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. గ్రామాలలో త్రాగునీటి కొరత ఏర్పడిందన్నారు. ప్రభుత్వ అసమర్ధ నిర్ణయాల వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయని అన్నారు. ప్రత్యర్ధి పార్టీలను దెబ్బతీయడం, నేతల ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తున్న వైసిపి కక్షపూరిత విధానాలను వివరించనున్నారు. దళితులపై వైసీపీ ప్రభుత్వం దమనకాండ, బీసీ వర్గాలపై రాజకీయ కక్ష, పంటల బీమా, యంత్ర పరికరాలు, సాగునీరు తదితర అంశాలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్లు ఏలూరి వివరిస్తారని అన్నారు. `బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ` టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తారని అన్నారు. చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రతో అక్రమ కేసులు బనాయించిన వైసిపి దిగజారుడు విధానాన్ని ఎండగడతారని అన్నారు.
రాజుగారి పాలెం నుంచి యాత్రకు శ్రీకారం
పర్చూరు నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు చేపట్టనున్న పర్చూరు ప్రగతి ప్రతిజ్ఞ ప్రజారక్షణ యాత్రకు టిడిపి శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతగా ఆరు మండలాల్లోని ఆరు గ్రామాల్లో ఏలూరి పర్యటించనున్నారు. విజయదశమి పండుగ రోజు మార్టూరు మండలంలోని రాజుగారి పాలెం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. పండుగ రోజు తమ గ్రామానికి వస్తున్న తమ ఆత్మీయ నేతకు ఘన స్వాగతం పలికేందుకు ఊరు వాడ కదలిరానున్నారు. గ్రామంలో సుందరంగా పసుపు తోరణాలతో అలంకరించనున్నారు. గ్రామ శివారులో స్వాగతం పలకనున్నారు. గ్రామంలోని రామాలయం, శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రగతి ప్రతిజ్ఞ ప్రజారక్షణ యాత్రను ఏలూరి ప్రారంభిస్తారు. మన పల్లెకు మన ఏలూరి లోగోను ఆవిష్కరిస్తారు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌టిఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పిస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. అన్నదాతల శ్రేయస్సు కోసం టిడిపి ప్రభుత్వంలో నిర్మించిన చెక్ డాంలను పరిశీలిస్తారు. పాదయాత్రగా మెయిన్ రోడ్డు మీదుగా జంగాల కాలనీ, ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీలో పర్యటిస్తారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జాష్టి సాంబశివరావు, కామేపల్లి జనార్దన్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.