Apr 28,2023 00:21

కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న నర్సింగరావు

- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు
ప్రజాశక్తి - ఆరిలోవ :
ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటం చేసిన ప్రజా సేవకుడు వి.కృష్ణమూర్తి అని సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు కొనియాడారు. ఆరిలోవకు చెందిన సిపిఎం సీనియర్‌ నేత, పార్టీ జిల్లా కార్యాలయ అకౌంటెంట్‌ కృష్ణమూర్తి హఠాన్మరణం నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులను సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ స్థానిక నాయకులతో కలిసి నర్సింగరావు పరామర్శించారు.
ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ కృష్ణమూర్తి మరణం అతని కుటుంబానికే కాకుండా, పార్టీకి, ఈ ప్రాంత ప్రజా ఉద్యమానికి తీరని లోటన్నారు. కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆరిలోవ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంతంలో పార్టీని, ప్రజా సంఘాలను నిర్మించడంలో కృష్ణమూర్తి కృషి మరువలేనిదన్నారు. కృష్ణమూర్తితోపాటు ఆయన భార్య అన్నపూర్ణ ఐద్వా సంఘంలోనూ, పార్టీలోనూ కీలక పాత్ర పోషించారన్నారు. నిరాడంబరమైన జీవితం, పిల్లలిద్దరికీ కులాంతర వివాహాలు చేసే ఆదర్శభావాలు, మరణించాక తన కళ్లను వేరొకరి కంటిచూపు కోసం, దేహాన్ని వైద్యవిద్యార్ధుల పరిశోధనల కోసం అందించిన ఆదర్శనీయుడని కొనియాడారు. దోపిడి లేని సమాజం నిర్మించడం కృష్ణమూర్తి సిద్ధాంతమని, అటువంటి ఆశయసాధన కోసం అందరం పనిచేయడమే ఆయనకిచ్చే ఘననివాళి అన్నారు. నర్సింగరావుతోపాటు స్థానిక సిపిఎం నేతలు వి.నరేంద్రకుమార్‌, పి.శంకరరావు, కె.సత్యనారాయణ, సన్యాసిరావు ఉన్నారు.