లక్కిరెడ్డిపల్లి : ఈనెల 15న విజయవాడలో నిర్వహించబోయే ప్రజారక్షణ బేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ. రామాంజులు పిలుపునిచ్చారు. గురువారం అయన సిపిఎం నాయకులతో కలిసి స్థానిక మూడు రోడ్ల సర్కిల్ ఆవరణలో ప్రజాభిక్షణభేరి ప్రచార పోస్టర్లను కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వానికి మద్దతిస్తూ వైసిపి, టిడిపి, జనసేనలు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా, దళిత, గిరిజన వ్యతిరేక రాజకీయాలను వైసిపి, టిడిపి, జనసేనలు బలపరుస్తున్నాయన్నారు. వాటిని ప్రజలకు వివరించడం సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారక్షణ బేరీ యాత్రను నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 15న విజయవాడలో బహిరంగసభ జరగనున్నదన్నారు. దళితులు, గిరిజనుల హక్కులను హరించేలా పార్లమెంటులో చట్టాలు చేస్తున్న బిజెపికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్న వైసిపి, టిడిపి రాష్ట్రంలో మోసపూరిత రాజకీయాలు చేస్తున్నా యని విమర్శించారు. పార్లమెంటులో మద్దతిస్తూ రాష్ట్రంలో సాధికార యాత్రలు చేయడమేంటని ప్రశ్నించారు. వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రుల ఉపన్యాసాలు వింటుంటే హాస్యాస్పదంగా ఉన్నాయ న్నారు. ఒకవైపు సామాజిక న్యాయాన్ని సంహరిస్తూ మరోవైపు తామే కాపాడుతున్నామంటూ ఊరేగింపులు, సంబరాలు చేస్తూ సాధికారితను అపహాస్యం చేశారన్నారు. ఉపాధి హామీ పనులకు కోతలు విధించారని, బడ్జెట్‌లో నిధులు తగ్గించారని, దీనికి వైసిపి మద్దతు తెలిపిందని చెప్పారు. పనికి ఆహార పథకం మీద ఆధారపడేది ఎక్కువ మంది దళితులు, పేదలేనని వివరించారు. రాష్ట్రాల హక్కులను హరించే కేంద్రంలోని బిజెపి చర్యలను ఏమాత్రం ప్రతిఘటించకుండా, అడుగడుగునా రాజీ పడుతున్న వైసిపి సామాజిక సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బిజెపిని ఓడించాలని దానికి మద్దతునిస్తున్న వైసిపి తెలుగుదేశం జనసేనలను నిలువరించాలని ప్రజారక్షణ భేరి సభను విజయవాడలో నిర్వహిస్తున్నామని, సభకు సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి రాఘవులు హాజరు అవుతున్నారని తెలిపారు. ప్రజలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జి. భోగేశ్వరయ్య, శ్రీరాములు రెడ్డెప్పరెడ్డి, చంద్ర వెంకటరమణ, రామయ్య పాల్గొన్నారు.