రాయచోటి : లౌకిక వాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అస మానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో నవంబర్ 15న నిర్వహించబోయే ప్రజా రక్షణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ప్రజారక్షణ భేరి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్క రించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బిజెపి తెలుగు రాష్ట్రాలకు అన్ని రకాలుగా తీవ్రమైన అన్యాయం చేస్తున్నప్పటికీ టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడంతో పాటు విశాఖ ఉక్కు, పోర్టులు, రోడ్లను ఆదాని పరం చేసినా, విభజన హామీలు అమలు చేయకపోయినా, నిత్యావసర సరుకుల ధరలతోపాటు, విద్యుత్ ఛార్జీల పెంచినా వామపక్ష పార్టీలు మాత్రమే బిజెపి విధానాన్ని ఖండించాయన్నారు. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడినా, మన రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవాలన్నా సామాన్య ప్రజలకు నిజమైన ఊరట లభించాలన్నా ప్రజలే ఐక్యంగా కదలాలని పేర్కొన్నారు. ఎవరి కోసమో ఎదురు చూసే కన్నా మన బతుకులను, రాష్ట్ర భవిష్యత్తును సక్రమ మార్గాన నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ ఉద్యమంలో సిపిఎంతో ప్రజానీకం భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్ళు పూర్తి కావస్తోం దన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు పరిశ్రమ లాంటి విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన బిజెపి అంతటితో ఆగకుండా రాష్ట్ర పారిశ్రామికాభివద్ధికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి సిద్దమైందని విమర్శిం చారు. అన్నదమ్ముల్లా సమైక్యంగా మెలగవలసిన ప్రజల మధ్య బిజెపి విద్వేషాలు రాజేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ ఏకపక్షంగా నిర్ణయాలను రుద్దుతుందని తెలిపారు. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్పొరేట్ సేవలో తరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి ద్రోహం చేసి విభజన హామీలకు ఎసరు పెట్టినా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనే ధైర్యం లేనప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలకు, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో, మోటార్లకు మీటర్లు పేరుతో, ఆస్తిపన్ను నుంచి చెత్తపన్ను వరకు అనేక భారాలు మోపుతున్నారన్నారు. ప్రభుత్వ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు నామమాత్రంగా తయారవడంతో కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి సామాన్యులు బలైపోతున్నారనరి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం, అంగన్వాడీలకు, ఆశాలకు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చేసిన వాగ్దానాలన్నీ గాలికెగిరిపోయాయని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు, శాఖా కార్యదర్శి బి.రెడ్డెయ్య, నాయకులు జి.మాధవయ్య, కెవిపిఎస్ నాయకులు డి.సి.వెంకటయ్య, రైతుసంఘం జిల్లాప్రధాన కార్యదర్శి రామచంద్ర పాల్గొన్నారు.