Nov 15,2023 21:18

ప్రజాశక్తి - భీమవరం, యంత్రాంగం
అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి ముగింపులో భాగంగా విజయవాడలో చేపట్టిన మహా ప్రదర్శన, బహిరంగ సభకు జిల్లా ప్రజానీకం వేలాదిగా తరలివెళ్లారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 70 వాహనాల్లో సుమారు ఏడు వేల మంది బుధవారం బహిరంగ సభలో పాల్గొన్నారు. నెల రోజులుగా సిపిఎం ప్రజా సమస్యలపై విస్తృత ప్రచారం చేసింది. జిల్లాలో ఆరు పట్టణాలు, 20 మండలాలు, 400 గ్రామాల్లో విస్తృతంగా ప్రజాప్రణాళిక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించారు. దీనిలో భాగంగా విజయవాడ బహిరంగ సభకు జిల్లా నుంచి కార్మికులు, స్కీమ్‌ వర్కర్లు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, సిపిఎం నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడారు. విజయవాడలో జరుగుతున్న ప్రజా రక్షణ భేరి బహిరంగ సభకు జిల్లా నుంచి ఏడు వేల మంది హాజరయ్యారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ధరలు తగ్గిస్తానని చెప్పి నిత్యావసర వస్తువుల ధరలను రోజురోజుకూ పెంచుతూ పోతోందన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిజెపికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఈ సభ ద్వారా తెలియజేయడానికి పూనుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్దసంఖ్యలో జనం ప్రత్యేక బస్సులు, వ్యాన్లు, లారీలతోపాటు రైళ్లపై విజయవాడ బయల్దేరి వెళ్లారు.