అనంతపురం ప్రతినిధి : అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి ప్రజారక్షణ భేరి సభకు ఎర్రదండు కదిలింది. సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో బుధవారం జరిగే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కష్టజీవులు మంగళవారం సాయంత్రం పయనమయ్యారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే సభకు ఇప్పటికే ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ సభకు హాజరవుతున్నారు. సభలో పాల్గొనేందుకు అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి ప్రశాంతి, కొండవీడు, ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, మహిళలు వెళ్లారు.
అసమానతలు లేని అభివృద్ధి కాంక్షిస్తూ అక్టోబర్ 2న రాష్ట్ర సదస్సుతో ప్రజారక్షణభేరి కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ప్రజారక్షణ భేరి యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతల నుంచి మొదలైంది. రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రారంభమైంది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ అధ్యక్షతన సాగిన ఈ యాత్రలో రాయలసీమ ప్రాంత వెనుకబాటుతనం, పాలకుల నిర్లక్ష్యం అంశాలను ఎత్తి చూపారు. తాడిపత్రిలో ప్రారంభమైన యాత్ర గుత్తి, పామిడి, అనంతపురం, రాప్తాడు, పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి మీదుగా కదిరి నుంచి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించింది. ఈ యాత్రకు ముందే అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధిపై మేధావులతో చర్చావేదికలు సైతం నిర్వహించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా స్కూటర్ యాత్రను సైతం అనంతపురం జిల్లాలో చేపట్టారు. ఇంటింటికి కరపత్రాల ద్వారానూ సమగ్రాభివృద్ధిపై చర్చను లేవనెత్తారు.
ప్రత్యామ్నాయంపై చర్చ
ఉమ్మడి అనంతపురం జిల్లా వెనుకబాటుకుగల కారణాలతో చెప్పడమే కాకుండా అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలను సిపిఎం సూచిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ పేర్కొన్నారు. కరువులకుగల కారణాలను విశ్లేషించడమే కాకుండా ఈ జిల్లాకు సాగునీటి ఆవశ్యకతను ఈ ప్రజారక్షణ భేరి యాత్ర సందర్భంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసామని ఆయన వివరించారు. ఉన్న వనరులను ఏ రకంగా వినియోగించుకోవచ్చు అన్నది ప్రభుత్వాల ముందు ఉంచామన్నారు. అదే రకంగా ఖనిజ సంపదకు నిలయమైన ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి గురించి కూడా తెలియజేశామన్నారు. నేడు జరిగే రాష్ట్ర స్థాయి సభలోనూ అసమానతలు లేని అభివృద్ధి అంశమే ప్రధానంగా ఉంటుందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధాన అజెండాగా ముందుకు తీసుకురావాలన్నది సిపిఎం ఉద్ధేశమని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను ప్రజల ముందు ఉంచనున్నట్లు తెలియజేశారు.