Oct 26,2023 21:21

సిపిఎం ప్రజా ప్రణాళిక బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తదితరులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ద్రోహం చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు.. బిజెపితో కలిసి ఆడుతున్న కపటనాటకాలకు తెరదించే సమయం వచ్చిందన్నారు. బుధవారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ' లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతల్లేని అభివృద్ధి కోసం' సిపిఎం ప్రజా ప్రణాళిక బ్రోచరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రజా ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెల్లేందుకు ప్రజా రక్షణ భేరి పేరుతో సిపిఎం బస్సు యాత్ర నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల నుంచి బస్సుయాత్రలు ప్రారంభమవుతాయని తెలిపారు.
బిజెపి పాలనలో దేశం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మత విద్వేషాలు సృష్టిస్తున్న బిజెపి ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదానీ, అంబానీలకు దోచి పెడుతుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణం, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, రైల్వేజోన్‌ వంటి విభజన హామీల్లో ఏ ఒక్కదానిని బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అంతటితో ఆగకుండా రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను తెగనమ్మడానికి తయారైందని అన్నారు. రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన బిజెపితో రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు అంటకాగుతున్నా యన్నారు. ఈపరిస్థితుల్లో అసమానతలు లేని అభివృద్ది కోసం సిపిఎం చేపట్టిన బస్సు యాత్రను, విజయవాడలో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 30న మన్యం జిల్లాలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర 31 తేదీ సాయంత్రం మెంటాడ చేరుకుంటుందని తెలిపారు. బహిరంగ అనంతరం రాత్రి అక్కడే నాయకులు బస చేస్తారని తెలిపారు. నవంబర్‌ 1 తేదిన ఉదయం 10 గంటలకు గజపతినగరం, 12 గంటలకు బుడతనాపల్లి లో బహిరంగ సభలు జరుగుతాయని తెలిపారు. అనంతరం గంట్యాడ మీదుగా అరకు వెళ్లనుందని తెలిపారు. రెండో బస్సుయాత్రను నవంబర్‌ 2న శ్రీకాకుళం జిల్లా మందసలో అఖిలభారత నాయకులు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ యాత్ర 3న విజయనగరం చేరుకుంటుందని, ఉదయం 9.30 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 4 గంటలకు శృంగవరపుకోట, 5 గంటలకు కొత్త వలసలో బహిరంగ సభలు జరుగుతాయన్నారు. అదే రోజు సాయంత్రం విశాఖపట్నంలోకి యాత్ర ప్రవేశించనుందని తెలిపారు. యాత్రల ముగింపు సందర్భంగా నవంబర్‌ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందని, ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, టివి రమణ, వి.లక్ష్మి పాల్గొన్నారు.