
ప్రజాశక్తి-అమలాపురం ఈ నెల 15న విజయవాడలో నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరి బస్ యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. స్థానిక గొల్లగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాల్యాద్రి మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తి కావస్తోందన్నాఉ. అప్పుడు మనకు అరచేతిలో స్వర్గం చూపించారన్నారు. కేంద్రంలోని బిజెపి నాయకులు, ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫాక్టరీ, రామాయపట్నం మేజర్ పోర్టు రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, కడప ఉక్కు, రైల్వే జోన్ వంటి విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన బిజెపి అంతటితో ఆగక రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి గుండె వంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి సిద్ధమయ్యిందన్నారు. సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తమయ్యిందని చెప్పారు. కోట్లాదిమంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్‌లను తెచ్చిందన్నారు. దేశీయ వ్యవసాయానికి, ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెచ్చే నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిదన్నారు. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ ఏకపక్షంగా నిర్ణయాలను రుద్దుతోందన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం విజయవాడలో చేపట్టిన బహిరంగ సభకు జిల్లా నుండి వేలాదిమంది తరలి వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జి.దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.