Nov 08,2023 23:43

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి -మధురవాడ : విజయవాడలో ఈ నెల 15వ తేదీన చేపట్టే ప్రజారక్షణభేరి బహిరంగ సభకు ప్రజానీకం పెద్ద ఎత్తున తరలిరావాలని సిపిఎం మధురవాడ జోన్‌ కార్యదర్శి డి.అప్పలరాజు కోరారు. ఈ మేరకు బుధవారం మధురవాడ సిఐటియు కార్యాలయం వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి.అప్పలరాజు మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ఏ తరగతి ప్రజానీకానికి రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం తదితరాలన్నీ ప్రయివేటు పరం అవుతున్నాయన్నారు. విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచి ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకురావడానికి సిపిఎం ఆధ్వర్యాన 'ప్రజా రక్షణ భేరి'' పేరుతో మూడు బస్సు యాత్రలు జరుగుతున్నాయన్నారు. వీటి ముగింపుగా ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరిగే బహిరంగ సభకు మధురవాడ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.రాజ్‌కుమార్‌, కె.సుజాత, కె.పుష్ప, వై.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.