Nov 04,2023 23:31

ప్రజాశక్తి-కాకినాడ లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతల్లేని అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం సీనియర్‌ నేత దువ్వా శేషబాబ్జి పిలుపు ఇచ్చారు. నవంబర్‌ 5వ తేదీన జాతా కాకినాడ చేరుకుంటున్న నేపథ్యంలో శనివారం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రచార వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రానికి కేంద్ర బిజెపి పాలకులు తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌ వంటి హామీల అమలుకు ఏమాత్రం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. అయినా రాష్ట్రంలో అధికారం వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ప్రశ్నించడానికి వచ్చిన జనసేన బిజెపి విధానాలకు వంత పాడుతున్నారని ఎద్దేవా చేశారు. యాత్ర నవంబర్‌ 5న సాయంత్రం 6 గంటలకు కాకినాడ అంబేడ్కర్‌ విగ్రహ సమీపంలో ఉన్న ట్యాక్సీ స్టాండ్‌ వద్దకు చేరుకుంటుందని, అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, మలకా వెంకట రమణ, కె.నాగజ్యోతి, చంద్రమళ్ల పద్మ, రాణి, రాజశేఖర్‌, టి.వీరబాబు, అంకం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.