Nov 03,2023 23:57

వాల్‌పోస్టర్‌ ను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సుయాత్ర 7న సంతనూతలపాడు నియోజకవర్గంలో పర్యటించున్నట్లు సిపిఎం జిల్లా నాయకులు జె. జయంతిబాబు ,ఎస్‌కె. మాబు తెలిపారు. ప్రజలందరూ పాల్గొని బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ఆదేశాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌పాటిస్తున్నట్లు తెలిపారు. మోడీ, జగన్‌ కలిసి ప్రజల సొమ్మును నొక్కేస్తారని విమర్శించారు పదేళ్ళ మోడీ పాలనలో ఒక్క ప్రాజెక్టు అన్న కట్టారా అని ప్రశ్నించారు. ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పించిన దాఖలాలు లేవన్నారు. అలాంటి మోడీ ప్రభుత్వాన్ని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఎందుకు బలపరుస్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో మండల రైతులు సాగు చేసిన పంటలు నీరు లేక ఎండి పోతున్నాయని తెలిపారు. రబీ సాగు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దీంతో రైతులు,కూలీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నాగులుప్పలపాడును కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సాగర్‌ నుంచి 2 టిఎంసిల నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విదానాలను నిరసిస్తూ సిపిఎం ప్రజారక్షణ భేరి బస్సుయాత్ర చేపట్టిందన్నారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 15న హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బహి రంగసభలో ప్రజలు, రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి టి.శ్రీకాంత్‌ ,జి.బసవపున్నయ్య, ఎన్‌.రామారావు పాల్గొన్నారు.