May 24,2023 00:38

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రజిని, వేదికపై చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టినా, కలెక్టర్‌ తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో జెడ్‌పి హాలులో మంగళవారం జరిగింది. సమావేశానికి చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా అధ్యక్షత వహించగా జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు తమ మండలంలో సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించారు.
నకిలీ విత్తనాలు అరికట్టండి : కెఎస్‌ లక్ష్మణరావు
నకలీ విత్తనాలను అరికట్టాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. గత ఖరీఫ్‌లో క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో నకిలీ విత్తనాల సరఫరా జరిగినట్టు నిర్ధారణ అయినా ఇంత వరకు రైతులకు పరిహారం అందలేదన్నారు. పసుపు పంట మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చూడాలని కోరారు. ఇటీవల అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టం అంచనాలు ప్రభుత్వానికి పంపిచారా? లేదా? గత ఏడాది గుంటూరు జిల్లాలో 41 వేల మందికి కౌలు రైతు కార్డులను ప్రభుత్వం ఇస్తే ఇప్పటి వరకు బ్యాంకులు కేవలం 4,010 మందికి రుణాలు ఇచ్చారని, ఈ ఏడాది లో 68 వేల మంది కౌలు రైతులకు రుణాలను అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారని, వారిలో ఎక్కువ మంది ఎస్సి,ఎస్టి, బి,సీ రైతులు ఉన్నారని ఆయా సామాజిక వర్గాల వారికి కనీసం రూ.100 కోట్లు వరకు రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో జెడ్‌పి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని, కస్తూరిబా, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత పర్యవేక్షణ ఉండేలా చూడాలని కోరారు. ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌ విధులను కేటాయించవద్దని సూచించారు. పల్నాడు జిల్లాలో వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చాయని తొలుత నిధులు విడుదల చేసి టెండర్లు పిలవాలని కోరారు. గుంటూరు ఛానల్‌ విస్తరణ పెదనందిపాడు వరకు విస్తరించడం వలన సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు, 60 గ్రామాలకు తాగు నీరు వస్తుందని, దీనికి సంబంధించిన భూ సేకరణకు రూ.113 కోట్లు అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, వెంటనే నిధులు విడుదల అయ్యేలా చూడాలన్నారు.
మిర్చి విత్తనాల బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలి : మర్రి రాజశేఖర్‌
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ మిరప విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు రైతులకు అంటగడుతున్నారని, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. రైతులకు అవసరమయ్యే విత్తనాల్లో 20 శాతం మాత్రమే ఆర్‌బికెలా ద్వారా సరఫరా చేస్తే మిగతా విత్తనాలు బ్లాక్‌లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. రైతులకు ఎంత అవసరమో అంత సరఫరా చేయాలన్నారు. రొంపిచర్ల జెడ్‌పిటిసి నారాయణరెడ్డి మాట్లాడుతూ విత్తన కంపెనీలతో ఇంత వరకు ఒప్పందం చేసుకోకుండా ఖరీఫ్‌లో విత్తనాలు ఆర్‌బికెల ద్వారా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బోయపాలెం -ఫిరంగిపురం రహదారి పనులు ఒకవైపునే వేశారని, మిగతా వైపు వదిలి వేశారని వెంటనే ఆ పనులు జరిగేలా చూడాలని కోరారు. ఉన్నవ - గొట్టిపాడు రహదారి పొడవున ఏర్పడిన గుంతలను వెంటనే మరమత్తులు చేయించాలన్నారు.
ఆర్‌బికెల ద్వారా విత్తనాల సరఫరాకు చర్యలు : మంత్రి రజని
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతు గ్రూపులను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా సమస్య వస్తే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల్లోని రైతులకు ఆ గ్రామంలోనే కావాల్సిన విత్తనాలు ఆర్‌బికెల ద్వారా అందిస్తున్నారని, విత్తనాల కొరత ఎక్కడా రాకుండా జిల్లా కలెక్టర్‌లు పర్యవేక్షించాలని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యా విధానంలో సంస్కరణలు, నాడు-నేడు ద్వారా పాఠశాలలు ఆధునీకరించడం, వసతుల కల్పన, పౌష్టికాహారం సరఫరాతో పదవ తరగతితో కార్పొరేట్‌ స్కూల్స్‌తో సమానంగా ఉత్తీర్ణత సాధ్యమైనట్లు చెప్పారు. అత్యధిక మార్కులు సాధించిన వారికి జగనన్న ఆణిముత్యాల్లో ఈ నెల 25న నగదు బహుమతులు ఇస్తామని తెలిపారు. వరికపూడిశెల తొలి విడత నిధులు, గుంటూరు ఛానల్‌ విస్తరణ నిధుల విడుదలకు కృషి చేస్తామన్నారు.
అన్ని మండలాలకు సమానంగా నిధులు : చైర్‌పర్సన్‌
జెడ్‌పి చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ అన్ని మండలాలకు సమానంగా నిధులు ఇస్తామన్నారు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ శాఖల అభివృద్ధితో పాటు, విద్యా, వైద్య, ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీటితో పాటు ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా చేయించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు త్రాగు నీరు, సాగు నీరు సకాలంలో అందించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను ప్రజల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచుతూ, సంపూర్ణ పారిశుధ్య పనులు నిర్వహించేలా సమగ్ర చర్యలు తీసుకున్నామన్నారు.
కౌలు రైతులకు విరివిగా రుణాలు : కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి
గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులకు విరివిగా రుణాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అకాల వర్షాలకు జరిగిన పంట నష్టం వివరాలు సోషల్‌ ఆడిట్‌ చేసి ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. ఆర్‌బికెల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలకు సంబంధించి వివరాలు సేకరించి ఆ మేరకు నాణ్యమైన విత్తనాలు ఆర్‌బికెల ద్వారా మాత్రమే విక్రయించేందుకు చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు.
గుంటూరు ఛానల్‌లో డ్రెయినేజి నీరు : కిలారి రోశయ్య
పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ నంబూరు వద్ద వంతెన పక్కన డ్రెయినేజ్‌ మురుగు కలవడంతో దుర్వాసన వస్తోందని, అక్కడక్కడ తూటికాడ వలన సాగునీరు ముందుకు పోవడం లేదని, వెంటనే బాగు చేయించాలని కోరారు. సమావేశంలో మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్‌ జంగా కృష్ణమూర్తి, బాపట్ల కలెక్టర్‌ రంజిత్‌బాష, పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌, జెడ్‌పి సిఇఒ మోహనరావు పాల్గొన్నారు.