ప్రజాశక్తి- ఆమదాలవలస: ప్రజల కోసం ప్రగతి కోసమే సైన్స్ అని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. గురువారం పట్టణంలోని లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, ఎల్ ఎన్ పేట మండలాల జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు, సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివద్ధి చెందాలన్నదే వేదిక ముఖ్య ఉద్దేశమని అన్నారు. అప్పట్లో శాస్త్రీయ సమాజ నిర్మాణానికి అవరోధంగా ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించాల్సిన అవసరాన్ని గుర్తించి బాధ్యతతో లక్షలాది స్వచ్ఛంద కార్యకర్తలను తయారు చేసి కళా జాతాల ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తయారు చేయడం జరిగిందన్నారు. పురాణ కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఉందంటూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని, రుజువు లేని అశాస్త్రీయ అంశాల వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరిస్తూ నిజమైన సైన్స్ ప్రజల ప్రగతికి ఎలా దోహదం చేస్తుందో జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రచారం చేయడమే లక్ష్యం అని అన్నారు. చంద్రయాన్ 3 విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు జన విజ్ఞాన వేదిక తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి మోహన రావు, సహ అధ్యక్షులు బొడ్డేపల్లి జనార్దన్ రావు, డివిజన్ గౌరవాధ్యక్షులు హెచ్. వి. సత్యనారాయణ, డివిజన్ కార్యదర్శి బొడ్డేపల్లి ప్రకాశరావు, డివిజన్ కోశాధికారి కె. షణ్ముఖరావు, నాయకులు బెండి సూర్యనారాయణ, అరినేని కష్ణారావు, కూన శ్రీనివాసరావు, పొన్నాడ పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.










