ప్రజాశక్తి-అనకాపల్లి
కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని, అందుకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల కుదింపు, ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, ప్రజలపై మోయలేని భారాలు వంటి సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. జిల్లాలో మూతపడ్డ ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలను తక్షణమే తెరిపించి క్రషింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అసంఘటిత రంగ కార్మిక, స్కీం వర్కర్ల పోరాటాలకు సిపిఎం వెన్ను దన్నుగా నిలుస్తోందని చెప్పారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ, ప్రభుత్వ విద్య, వైద్యం బలోపేతానికి పార్టీ పోరాడుతుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు కూలి రేట్లు పెంచాలని, 200 పని దినాలు కల్పించాలని, రైతు, కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.ప్రభావతి, జి.కోటేశ్వరరావు, ఎం.అప్పలరాజు, నాయకులు ఆర్.శంకర్రావు, గంట శ్రీరామ్, వివి శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ, ఆర్ రాము, ఎ.బాలకృష్ణ, సత్తిబాబు, రాజు, దేవుడు నాయుడు, ఎస్.అరుణ తదితరులు పాల్గొన్నారు.










