- కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
- ఘనంగా ప్రజాశక్తి 43వ వార్షికోత్సవ వేడుకలు
- ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, పొందూరు: ప్రభుతాన్ని పాలించేదెవరైనా పత్రికలు మాత్రం ప్రజా పక్షమే వహించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ఎచ్చెర్ల మండలం కుశాలపురం ఇండిస్టియల్ ఎస్టేట్‌లోని ప్రజాశక్తి ఎడిషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాశక్తి 43వ వార్షికోత్సవ సభ, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిష్పక్షపాతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పత్రికలపై ఉందని, దాన్ని ప్రజాశక్తి నెరవేరుస్తోందని ప్రశంసించారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళం అభివృద్ధి ఒక్క అధికార యంత్రాంగంతోనే సాధ్యం కాదని, పత్రికల భాగస్వామ్యమూ అవసరమన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మికులు, బడి మానేసి పనుల్లోకి వెళ్లడం వంటి సమస్యలున్నాయని వాటితో యుద్ధం చేయాలంటే ప్రభుత్వం, అధికార యంత్రాంగంతో పాటు మీడియా సాయం ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో మూల స్తంభంగా ఉన్న మీడియా కీలకపాత్ర పోషించాల్సి ఉందన్నారు. మంచైనా, చెడైనా ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించారు. ప్రజా సమస్యలపై వార్తలు రాయడంతో పాటు ప్రజాశక్తి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడంతో పాటు పత్రికా రంగంలో మంచి బాటలు వేయడంతో మరింత బాధ్యతగా ఉండాలని ఆకాంక్షించారు.
ఎపిఐఐసి జోనల్ మేనేజర్ సి.యతిరాజు మాట్లాడుతూ శ్రీకాకుళాన్ని వెనుకబడిన జిల్లాగా కాకుండా రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తున్న ప్రజాశక్తిని అంతా ఆదరించాలని కోరారు. డిపిఆర్‌ఒ బాలమాన్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రజాశక్తి తనవంతు పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. సిఐటియు సీనియర్ నాయకులు భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతు, కార్మిక, పీడిత వర్గం కష్టాలకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ప్రజాశక్తి ఏర్పాటైందని చెప్పారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజాశక్తి తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు. పత్రిక మరింత అభివృద్ధి పథంలో కొనసాగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
ప్రజల సమస్యలను, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, వాటిని పరిష్కరించడంలో ప్రజాశక్తి తనవంతు పాత్ర పోషిస్తోందని ప్రజాశక్తి ఎడిషన్ మేనేజర్ పి.కామినాయుడు అన్నారు. ప్రజాశక్తి ప్రస్థానాన్ని వివరించారు. సామాజిక బాధ్యతగా ప్రజాశక్తి చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. స్టాఫ్ రిపోర్టర్ టి.భీమారావు అధ్యక్షత వహించిన సభలో డెస్క్ ఇన్‌ఛార్జి జి.లక్ష్మణరావు ఆహ్వానం పలకగా, యాడ్స్ ఇన్‌ఛార్జి టి.బుజ్జిబాబు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్‌డిఒ బి.శాంతి, జెమ్స్ అసిస్టెంట్ మేనేజర్ ఎం.సింహాచలం, కోమలి డెంటల్ క్లినిక్ వైద్యులు డాక్టర్ రేఖ, జెమ్స్ వైద్యులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
ప్రజాశక్తి 43వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జెమ్స్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో గైనకాలజిస్టులు, నేత్ర, గుండె, జనరల్ ఫిజీషియన్ వైద్యులు తమ సేవలను అందించారు. బిపి, సుగర్, ఇసిజి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. రోగులకు అవసరమైన మందులు ఉచితంగా ఇచ్చారు. కోమలి డెంటల్ క్లినిక్ ఆధ్వర్యాన దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కుశాలపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










