May 05,2023 21:27

 లబ్ధిదారులకు మెగా చెక్‌ను అందజేస్తున్న ఎంపి గీత, కలెక్టర్‌ కృతికా శుక్లా


ప్రజాశక్తి - కాకినాడ
ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఎంపి వంగా గీత శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల కింద ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్‌ వివేకానందహాల్‌ నుంచి ఎంపీ వంగా గీత, కలెక్టర్‌ కృతికా శుక్లా, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు అధికారులు, వివిధ ప్రాంతాలకు చెందిన కొత్తగా పెళ్లయిన జంటలతో కలిసి వర్చువల్‌గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో లబ్ధి మొత్తాన్ని జమచేసిన అనంతరం ఎంపి గీత, కలెక్టర్‌ కతికా శుక్లా, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కాకినాడ జిల్లాలోని లబ్ధిదారులకు మెగా చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వారు కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

508 మందికి రూ. 3.61 కోట్ల లబ్ధి : కలెక్టర్‌
కలెక్టర్‌ కతికా శుక్లా మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి జనవరి-మార్చి, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 508 మంది లబ్ధిదారులకు రూ. 3.61 కోట్ల మేర లబ్ధి జరుగుతోందని తెలిపారు. అర్హులైన వారిని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఎస్‌సి,ఎస్‌టి రూ. లక్ష, ఎస్‌సి, ఎస్‌టి (కులాంతర వివాహం)లకు రూ. 1,20,000, బిసిలకు రూ. 50,000, బిసిల(కులాంతర వివాహం)కు రూ.75 వేలు, మైనార్టీలకు రూ. లక్ష చొప్పున ఇలా వివిధ కేటగిరీలకు లబ్ధి చేకూరుతోందని కలెక్టర్‌ వివరిస్తూ కొత్త జంటలు జీవితాంతం హాయిగా జీవించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిఎల్‌డిఒ పి.నారాయణమూర్తి, డిఆర్‌డిఎ డిపిఎంలు వివి రారు, భరత్‌బీ ఎపిఎం ఎస్‌.వేదకుమారి, వివిధ ప్రాంతాలకు చెందిన కొత్తగా పెళ్లయిన జంటలు హాజరయ్యారు.