- నేడు గరికపాటి రాజారావు వర్ధంతి
కవులు, కళాకారులు ఎప్పుడూ సమాజ హితాన్ని కోరి తమ రచనలు కాని, ప్రదర్శనలు కాని చేస్తుంటారు. అయితే మళ్ళా ఆ ఇద్దరిలో కవి కంటే కళాకారుడే ప్రజలకు లేదా సమాజానికి బాగా దగ్గరవుతాడు. మన ప్రాచీన గ్రంథాలు పురాణేతిహాసాల లోని కథలు, అంశాలు ప్రజలకు బాగా చేరువయ్యాయంటే అందుకు కవుల కంటే, కళాకారులే ముఖ్య కారణం. అలాంటి కళాకారులందరినీ ఒక చోట చేర్చి దానికి ప్రజా నాట్యమండలి అనే ఒక మంచి పేరు పెట్టి, 'కళ కళ కోసం కాదు-అది ప్రజల కోసం' అని నినదించిన గొప్ప కళాకారుడు డాక్టర్ గరికపాటి రాజారావు. 1915 ఫిబ్రవరి 5న రాజమండ్రిలో జన్మించిన ఆయన చదువు వివిధ ప్రదేశాల్లో సాగింది. మద్రాసులో విద్యార్థిగా ఉన్నపుడే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత విజయవాడ వచ్చి పోరంకిలో ప్రజా వైద్యశాలను స్థాపించారు. జాతీయ స్థాయిలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడి ప్రపంచ శాంతిని, అభ్యుదయ భావజాలాన్ని, ఫాసిస్టు వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న తరుణం అది. అయితే ఆ భావజాలాన్ని అట్టడుగు వర్గాలకు చేరువ చెయ్యాలన్న ఉద్దేశంతో అభ్యుదయ కాముకులు, ముఖ్యంగా కమ్యూనిస్టు నేతల దృష్టి దృశ్య కళ అయిన రంగస్థల కళపై పడింది. ఆ నేపథ్యంలో 1943 ప్రాంతంలో ''ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్'' అనే సంస్థ ఆవిర్భవించింది. దీన్నే ''ఇఫ్టా'' అనేవారు. ఈ సంస్థకి ఆంధ్ర ప్రాంతం నుంచి గరికపాటి రాజారావు గారిని, హైద్రాబాద్ ప్రాంతం నుంచి మగ్దుం మొహియుద్దీన్ ను బాధ్యులుగా ఎంపిక చేశారు. ఇదే ఆంధ్ర ప్రాంతంలో ప్రజానాట్యమండలిగా రూపొందింది. 1940 దశకం నుండి ఒక దశాబ్ది కాలం పాటు ప్రజా నాట్యమండలి, రాజారావు గారి సారథ్యంలో సాహిత్య సాంస్కృతిక రంగాలను అప్పటికే వివిధ నాటక సమాజాల వారు, కళాకారులు, ప్రదర్శించే నాటకాలు, ఇతర కళారూపాలలో ప్రస్ఫుటమయ్యే కొన్ని లోపాలను గరికపాటి గుర్తించారు. వాటిని అధిగమించే శిక్షణా తరగతులను నిర్వహించారు. ఆ లోపాలను సరిచేసుకొంటూనే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యల్నీ చర్చించి, ఆ సమస్యల నేపథ్యంతో ప్రజా చైతన్యానికి ఊపునిచ్చే సందేశాన్ని మేళవించి, నాటకాలు రచింపజేసి ప్రదర్శించటం మొదలు పెట్టారు. జాతీయోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ పోరాటం, ఇలా అనేక ఉద్యమాలలో ప్రజల్ని పీడించే పాలకులకు, అధికారులకు, వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచటంలో, ప్రజానాట్యమండలి కళాకారులు చేసిన కృషి ఎనలేనిది.
ఆంధ్ర ప్రజానాట్యమండలికి ఆస్థాన కవులుగా సుంకర, వాసిరెడ్డిగార్లను చెప్పుకోవాల్సిందే. వీరి ముందడుగు గొప్ప నాటకం. ఇంకా మా భూమి, విశ్వశాంతి పరివర్తనం, అల్లూరి, షాజహాన్, హిట్లర్, తెరలో తెర, వీధి భారతం, ప్రెస్ వర్కర్ వంటి నత్య రూపకాలను గరికపాటి రాజారావు అద్భుతంగా శిక్షణనిచ్చి ప్రదర్శింపజేసేవారు. అయితే 1948 లో ఈ ప్రజా నాట్యమండలికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కమ్యూనిస్టు పార్టీ, ఇష్టాతో సహా వాటి అనుబంధ సంస్థలన్నిటి పైనా రెండు దశాబ్దాలపాటు ప్రభుత్వం నిషేధం విధించింది. మళ్ళీ 1967లో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పునరుద్ధరించటం జరిగింది.
రాజారావు ఈ నిషేధ సమయంలోనే సినీరంగ ప్రవేశం చేసారు. మద్రాసు చేరుకొని తనే కథ, నిర్మాత, దర్శకునిగా ''పుట్టిల్లు'' సినిమా తీశారు. సినీ నటి జమునను వెండితెరకు పరిచయం చేశారు. ఎందరో ప్రజానాట్యమండలి కళాకారులతో పాటు ఇతర కళాకారుల్ని కూడా సినిమా ప్రపంచానికి పరిచయం చేసారు. రాజారావు కాలికి గజ్జె కట్టి పాటపాడుతూ నృత్యం చేస్తే చైతన్యం ఎగసిపడుతుంది. ఒకసారి శ్రీశ్రీ ప్రతిజ్ఞ గీతాన్ని రాగతాళయుక్తంగా నర్తించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసారు. హిట్లర్ వీధి భాగవత పతాకసన్నివేశంలో రాజారావు చేసే కత్తీ సుత్తీ డప్పుల డ్యాన్సుకు జనం రెచ్చిపోతూ ఈలలూ చప్పట్లతో హోరెత్తించేవారు.
రాజారావు రాజమండ్రి వచ్చి ప్రజా వైద్యశాలను స్థాపించి పేద ప్రజలకు వైద్యం చేశారు. మందులు కొనుక్కోలేని పేద కార్మికులకు డబ్బు సాయం చేసేవారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా రాజారావు వైద్యం చేస్తే బతుకుతారన్న నమ్మకం ప్రజల్లో బాగా ఉండేది.
రాజమండ్రిలో ''రాఘవ కళా సమితి'' పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించారు. అంకం శంకరరావు, యాసంరెడ్డి వెంకటరావు, వై.శాంతా దేవి, కాకరాల...వంటి ఎందరో కళాకారుల్ని రంగస్థలానికి అందించారు. కళాకారుడు వ్యక్తిగత వ్యామోహాలకు తావియ్యకూడదన్నది ఆయన ఉద్దేశం. ప్రజా నాట్యమండలికి ఆర్గనైజర్‌గా, సమిష్టితత్వానికి ప్రతీకగా జీవిస్తూ, చుట్టూ వున్న వారిని కలుపుకు పోవటం ఆయన లక్షణం. తనకు తెలిసింది ఇతరులకు నేర్పటం, ఇతరుల నుండి నేర్చుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండటం ఈ రెండూ ఆయన నుండి నేర్చుకోవాల్సిన సుగుణాలు. మిగతా కళాకారులు వృద్ధి లోకి వస్తే తమని మించిపోతారేమో అన్న ఆలోచన ఆయనకు అస్సలు ఉండేదికాదు. అతడెంత గొప్పవాడైతే ఉద్యమానికి అంత ఉపయోగ పడతాడని ఆయన ప్రగాఢంగా విశ్వసించే వారు. రాజారావు వల్ల ఎందరో కళాకారులు కమ్యూనిస్టులు గాను, కమ్యూనిస్టులు కళాకారులు గాను తీర్చబడ్డారు. ప్రజానాట్యమండలి కోసం మనసా వాచా కర్మణా ఒక యంత్రంలా పని చేసే వారు. అయితే కళా రంగానికి, పేదల సంక్షేమానికి, అహరహం కృషి చేసిన ఆయన ఊహించని విధంగా తన 48వ ఏట, 1963 సెప్టెంబర్ 8న మద్రాసులో గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన వదిలి వెళ్ళిన ప్రజానాట్యమండలి మాత్రం ఆయన జ్ఞాపకాలను పదిలపరచుకొంటూ...వేమన, కందుకూరి, జాషువా వంటి మహా కవుల జీవితాలను నృత్య రూపకాలుగా తీర్చి ప్రదర్శిస్తూ ప్రజల్లోకి మరింత వేగంగా దూసుకు పోతోంది. ఇలా ప్రజానాట్యమండలి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటుంది. అది ఉన్నంతకాలం గరికపాటి రాజారావూ మనందరి హృదయాల్లోనూ సజీవంగా ఉంటారు.
- డా|| జోస్యుల కృష్ణబాబు
సెల్: 9866454340










