విశాల ప్రజా ఐక్యతకు, శ్రమజీవుల నాయకత్వ పోరాట పటిమకు శుక్రవారం జరిగిన భారత్ బంద్ దర్పణం పట్టింది. సంఘటిత పోరాటాలకు మరో దీపధ్వజాన్ని అందించింది. విదేశీ కార్పొరేట్ కంపెనీలకు రైతన్నల భూములను, ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు ఇలా సమాజంలోని తరగతులన్నీ సంఘటితమై మోడీ సర్కార్ నయవంచనపై సమరశంఖం పూరించాయి. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు మినహా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ప్రజానీకం స్వచ్ఛందంగా ఈ బంద్‌లో భాగస్వామ్యం కావడం విశేషం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్ముకాశ్మీర్ బంద్ సందర్భంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బిజెపి పాలిత యుపి, గుజరాత్, కర్ణాటకలో కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసి తీవ్ర నిర్బంధం కొనసాగించినా ప్రజానీకం మొక్కవోని దీక్షతో బంద్ చేపట్టడం అభినందనీయం. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ దిగ్విజయమైంది. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో పాటు విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వెనక్కి తీసుకోవాలనే నినాదంతో ఆంధ్రావని మార్మోగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్నం వరకూ బస్సులు నిలిపేయడం ద్వారా బంద్‌లో భాగస్వామ్యం కావడం ముదావహం.
బిజెపి ప్రభుత్వ వినాశకర విధానాలను తులనాడుతూ ఇటీవల కాలంలో జాతీయ స్థాయి ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అదే క్రమంలో ప్రజల సంఘటిత శక్తి వేళ్లూనుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, పెట్టుబడుల ఉప సంహరణ విధానాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్, బీమా రంగ ఉద్యోగులు ఇదే నెలలో చేపట్టిన నాలుగు రోజుల సమ్మె సందర్భంలోనూ ప్రజలు ఐక్యత చాటిన సంగతి తెలిసిందే. వరుసగా చోటుచేసుకుంటున్న ఉద్యమాలు ప్రజా ఐక్యతకు బాటలేస్తుండగా బిత్తరపోతున్న మోడీ సర్కార్ ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేందుకు చిచ్చు రాజేస్తూనేవుంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) తీసుకొచ్చి హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు సృష్టించాలని ఢిల్లీ వేదికగా ఎంతటి దురాగతాలకు పాల్పడిందో చూశాం. అత్యంత శాంతి, సహృద్భావ వాతావరణంలో సాగుతున్న అన్నదాతల ఆందోళనలపై ఖలిస్తాన్ తీవ్రవాద ముద్ర వేసేందుకు ఇదే మోడీ సర్కార్ ఎర్రకోట సాక్షిగా సాగించిన సిగ్గుమాలిన చర్యలను చూశాం. ఈ దురాగతాలు సాగనివ్వబోమనే ఢిల్లీ స్థానిక ఎన్నికల్లోనూ, బీహార్ ఎన్నికల్లోనూ ఓటర్లు బిజెపికి కర్ర కాల్చి వాతలేశారు. కుక్కతోక వంకర చందంగా బిజెపి మాత్రం తన విభజన, విద్వేష జాడ్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. రెండ్రోజుల కిందటే కేరళ నుంచి రైలులో వెళ్తున్న ఇద్దరు క్రైస్తవ నన్‌లను ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తన పోలీసులతో బలవంతంగా దించేసి అవమానాలకు గురి చేసింది. తెలంగాణలోని బైంసాలోనూ, మన రాష్ట్రంలోని తిరుపతి, అంతర్వేది తదితర చోట్ల కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కాషాయ మూకలు యత్నిస్తూనేవున్నాయి. ఎన్నికలు జరుగుతున్న అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో హిందూ- ముస్లిం విద్వేషాలను రాజెయ్యడానికి మోడీ- షా ద్వయం అన్ని రకాల కుయుక్తులకూ పాల్పడుతున్నారు. ప్రజానీకం ఐక్యత ముందు మోడీ సర్కార్ కుట్రలు ఛిద్రమౌతూనేవుండటం విశేషం.
ఢిల్లీ సరిహద్దులో నాలుగు నెలలుగా సాగుతున్న అన్నదాతల అద్వితీయ పోరాటం భారత ప్రజానీకానికి ముఖ్యంగా శ్రామిక జీవులకు ఎన్నో పాఠాలు నేర్పింది. అననుకూల వాతావరణం, వయోభారం తదితర కారణాలతో ఇప్పటి వరకూ 300మంది పైగా రైతులు ప్రాణాలు కోల్పోయినా..సర్కార్ వేధింపులు వెంటాడుతున్నా రైతన్నలు ఏనాడూ వెనుదిరిగింది లేదు. వెన్నుచూపింది లేదు. ఇది కేవలం ధనిక రైతు వర్గం సాగించే పోరాటం అంటూ బిజెపి బాకాలు, వాటితోబాటు స్వయంగా మోడీ గొంతు చించుకున్నా, ఆచరణలో గ్రామీణ భారతంలో అన్ని తరగతుల రైతాంగంతో బాటు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు ఉద్యమంలో ఐక్యంగా నిలిచారు. కార్మిక, కర్షక ఐక్యతతో అణిచివేతలను ఎదుర్కొంటూ అనలశక్తిగా పోరాటం సాగిపోతోంది. అబలలనే మనువాద ముద్రలను చెరిపేస్తూ మహిళా రైతులు సైతం ఈ మహోద్యమంలో మహోజ్వల పాత్ర పోషిస్తుండటం సాధారణ విషయం కాదు. వినాశకర చట్టాలతో, ప్రజలపై భారాలతో ప్రయివేటీకరణ, కార్పొరేట్ అనుకూల విధానాలతో మొండిగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్‌కు గుణపాఠం చెప్పే రోజులు సమీపిస్తున్నాయనడానికి ఈ జనైక్యతే నిదర్శనం.










