ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్ : పరిశుభ్రమైన గ్రామాలే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చెత్త సేకరణకు బుట్టలను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి శంబంగి లక్ష్మి, వేణుగోపాలనాయుడు, ఎంపిడిఒ రవికుమార్, ఇఒపిఆర్‌డి అల్లు భాస్కరరావు పాల్గొన్నారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యత
రామభద్రపురం : ప్రతి ఇంటా పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు కోరారు. స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మంజూరైన సుమారు 8 వేల తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ చేసేందుకు గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసి గ్రీన్ అంబాసిడర్లకు అందించాలన్నారు. గ్రామాలు శుబ్రంగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తొలుత రామభద్రపురం మేజర్ పంచాయతీ సిబ్బందికి చెత్త బుట్టలు అందజేసి, ఇంటింటా సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం బొబ్బిలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను జెసి రాజు ద్వారా ఎంపిపి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రమామణి, తదితరులు పాల్గొన్నారు.










