చేతి శుభ్రత లేని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అనారోగ్యాలకు గురవుతున్నారని వైద్యులు తెలుపుతున్నారు. 'ఏం తిన్నాం అని కాదు....ఎలా తిన్నాం' అనే అంశం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఎందుచేతనంటే అనేక బ్యాక్టీరియాలకు, వైరస్ లకు మన చేతులే నివాసం. పనులు చేసే సమయంలో వివిధ వస్తువులను తాకుతాం. అనేక బ్యాక్టీరియాలు, వైరస్ లు చేతులకు అంటుకుంటాయి. అదే చేతులతో కళ్ళు, నోరు, పెదవులు తాకుతాం. అవే చేతులతో ఆహారం తీసుకుంటాం. దాంతో అనేక రోగాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. రోగాలు రాకుండా అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆధ్వర్యంలో 2008 నుంచి అక్టోబరు 15వ తేదీన ''ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవం'' జరుపుతున్నారు.
ఇన్‌ఫ్లుయంజా వైరస్ వల్ల దగ్గు, జలుబు...సాల్మోనెల్లా, షిగెల్లా, వైరస్ క్రిముల వల్ల విరేచనాలు, వాంతులు... ఇకోలి క్రిమి వల్ల మూత్ర నాళ ఇన్ఫెక్షన్, స్ట్రిప్టో కాకై వల్ల గొంతు నొప్పి...క్లెబ్ సిలా వల్ల పుండ్లలో ఇన్ఫెక్షన్...క్లోస్ట్రిడియమ్ డిఫికల్ వల్ల పేగు పూత... హిమోఫిలిస్ వల్ల కళ్ళు ఎర్రబారటం వంటి అనారోగ్యాలు వస్తుంటాయి. వీటికి ప్రధాన కారణం చేతులు పరిశుభ్రంగా లేకపోవడమే. ప్రస్తుతం ''కరోనా'' సోకకుండా ఉండాలంటే చేతుల పరిశుభ్రత అత్యావశ్యకం. సబ్బు/ లోషన్/ శానిటైజర్ వంటి వాటితో చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఆహారం భుజించాలి. సాధారణంగా వచ్చే విరేచనాలు, వాంతులు, టైఫాయిడ్, పచ్చ కామెర్లు వంటి అనారోగ్యాలకు ముఖ్య కారణం అపరిశుభ్రమైన చేతులేనని వైద్యులు తెలుపుతున్నారు.
మన దేశంలో వంట చేసే ముందు చేతులు శుభ్రం చేసుకొనేవారు కేవలం 30 శాతం మంది మాత్రమేనని ''యునిసెఫ్'' తెలిపింది. మల మూత్ర విసర్జన అనంతరం మన దేశంలో చేతులు శుభ్రం చేసుకొనే వారు కేవలం 53 శాతం మంది మాత్రమే. ఆహారం తినే ముందు 38 శాతం మాత్రమే చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. మొత్తంగా పరిశీలన చేస్తే భారతదేశంలో చేతుల శుభ్రత పాటించేవారు 44 శాతం జనాభా మాత్రమే అని ఒక అంతర్జాతీయ సర్వే తెలిపింది. దగ్గినా, తుమ్మినా, పెంపుడు జంతువులను తాకినా, బయటకు వెళ్లి వచ్చినా, మరుగుదొడ్లు ఉపయోగించిన అనంతరం తప్పక చేతులు శుభ్రం చేసుకోవాలి. పైన తెలిపిన రోగాలతో పాటు ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా, డయేరియా వంటి రోగాలు మటుమాయం కావాలంటే చేతి పరిశుభ్రత ప్రతీ ఒక్కరూ పాటించాలి. చేతి పరిశుభ్రత వలన 50 శాతం అతిసార సంబంధించిన వ్యాధులను, 20 శాతం - 30 శాతం శ్వాస సంబంధిత వ్యాధులను అరికట్టే అవకాశం ఉంది. 80 శాతం జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు. ఇటీవల కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, లాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడుతున్నారు. అలాగే పర్సుల నుండి డబ్బులు తీసి ఇస్తుంటాం. వీటిని ఒకరి నుంచి ఒకరు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. శానిటైజేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ''షేక్ హ్యాండ్'' బదులు నమస్కారం చేసి పలకరించే అలవాటు పెరగాలి. ఈ కరోనా కాలంలో మరింత జాగ్రత్తలు పాటించాలి.
- ఐ. ప్రసాదరావు,
సెల్ : 9948272919










