ప్రజాశక్తి-చిలకలూరిపేట : మండల పరిధిలోని మద్దిరాలలో జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ ఖోఖో మీట్ - 2023-24ను పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదో ఒక క్రీడలో పాల్గొనడం అవసరమని చెప్పారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని, మంచి నడవడిక, ఓర్పు, సమన్వయం సహకారం, నాయకత్వ లక్షణాలు, విషయ సంగ్రహణం అలవడతాయని చెప్పారు. ఈ లక్షణాలుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగొచ్చన్నారు. క్రీడలు వలన ఆలోచన శక్తి పెరుగుతుందని, సమయానుకూల స్పందన అలవడుతుందని, క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటి నుండి ఏ విధంగా బయటపడాలో అర్థమవుతుందని వివరించారు. క్రీడల వల్ల కీర్తిప్రతిష్టలనూ సాధించొచ్చన్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.










