Sep 21,2021 06:20

     జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించినట్లుగానే అధికార వైసిపికి ఏకపక్షంగా దఖలు పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న జడ్‌పి, ఎంపిపి ప్రాదేశిక స్థానాలకు పోలింగ్‌ నిర్వహించగా కోర్టు వ్యాజ్యాల కారణంగా ఓట్ల లెక్కింపు జరపలేదు. హైకోర్టు ధర్మాసనం తీర్పుననుసరించి ఆదివారం కౌంటింగ్‌ చేపట్టగా, ఏకగ్రీవాలు, ఎన్నికలు వాయిదా పడ్డవి మినహాయించి పోలింగ్‌ జరిగిన 515 జడ్‌పిటిసిలలో 502 వైసిపి కైవసం చేసుకోగా టిడిపి ఆరు, జనసేన 2, సిపిఎం 1, ఇండిపెండెంట్‌ ఒకరు గెలుపొందారు. ఎంపిటిసి 7,219కి పోలింగ్‌ జరగ్గా వైసిపి 5,998, టిడిపి 826, జనసేన 177, బిజెపి 28, సిపిఎం 15, సిపిఐ 8, స్వతంత్రులు 15 మంది నెగ్గారు. అన్ని జడ్‌పి ఛైర్‌పర్సన్‌, అత్యధిక ఎంపిపి అధ్యక్ష పదవులను అధికార పార్టీ అలవోకగా సాధించుకునే పరిస్థితులే ఉన్నాయి. ఎన్నికల ఫలితాల ద్వారా తమకు ప్రజా బలం గతం కంటే పెరిగిందని, ఆ మేరకు బాధ్యతలూ పెరిగాయని ముఖ్యమంత్రి చెప్పగా, వైసిపి అరాచకాలతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, బోగస్‌ ఫలితాలని టిడిపి విమర్శించింది. ఈ వాదనలెలా ఉన్నా, గడువు లోపు ఎన్నికలు నిర్వహించని కారణంగా అనేక సంవత్సరాలు ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గిన స్థానిక సంస్థలకు ప్రజలెన్నుకున్న పాలక మండళ్ల చేతికి అధికార పగ్గాలు రావడం మంచిదే.
     పరిషత్‌ ఎన్నికలు సాగిన విధానం రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సరికొత్త రికార్డే! నిరుడు మార్చిలో నోటిఫికేషన్‌ వెలువడగా ఏడాదిన్నర అనంతరం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడ్డాయి. తొలి నోటిఫికేషన్‌ మేరకైతే గతేడాది మార్చి 21న పోలింగ్‌ నిర్వహించి 24న రిజల్ట్స్‌ ప్రకటించాలి. కరోనా మొదటి దశ వ్యాప్తి భయాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) ఎన్నికలు వాయిదా వేసింది. అప్పటికే నామినేషన్ల తంతు ముగిసింది. కొత్త ఎస్‌ఇసిగా బాధ్యతలు చేపట్టిన నీలం సహాని ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండి ఆరంభించి ఏప్రిల్‌ 8న పోలింగ్‌కు తాజా నోటిఫికేషన్‌ ఇచ్చారు. పోలింగ్‌కు అనుమతించిన హైకోర్టు ధర్మాసనం ఓట్ల లెక్కింపుపై తాత్కాలిక స్టే ఇచ్చింది. చివరికి కౌంటింగ్‌కు అనుమతిస్తూ ఆర్డర్‌ ఇవ్వడంతో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు. వైసిపి దౌర్జన్యాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుండి ప్రారంభించాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో చివరి నిమిషంలో ఎన్నికల బహిష్కరణకు టిడిపి నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటికే నామినేషన్ల ఉపసంహరణలు పూర్తి కావడంతో టిడిపి అభ్యర్ధులు బ్యాలెట్‌ పత్రాల్లో అలాగే కొనసాగారు. ఫ్యాక్షన్‌, గ్రామ రాజకీయాల్లో ఆధిపత్య పోరు అధికంగా ఉన్న చోట్ల టిడిపి అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి పోటీలో ఉన్నారు. ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ వైసిపి తర్వాత టిడిపినే రెండో స్థానంలో, ప్రధాన ప్రతిపక్షంగానే ప్రజలు గుర్తించారు. ప్రజలు ఇచ్చిన స్థానాన్ని, బాధ్యతను నిర్వర్తించకుండా కేవలం గెలుపోటముల ఆధారంగా ఎన్నికల నుండి అర్ధంతరంగా నిష్క్రమించడం తగదు.
     ఈ మారు జరిగినన్ని ఏకగ్రీవాలను ఎన్నడూ చూడలేదు. జడ్‌పిటిసి 126, ఎంపిటిసి 2,371 ఏకగ్రీవం కావడం చరిత్రే! అన్నేసి స్థానాల్లో వేరెవ్వరూ నామినేషన్‌ వేసేందుకు ముందుకు రాలేదంటే ఒత్తిళ్లు, ప్రలోభాలు, భయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల వైసిపి దాష్టీకాలు, దౌర్జన్యాలు మీడియాలో ప్రముఖంగానే వచ్చాయి. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లోవలే ప్రభుత్వ సంక్షేమ పథకాల మూలంగా వైసిపిని ప్రజలు ఆదరించారని స్థూలంగా పరిషత్‌ ఫలితాల ద్వారా తెలుస్తుంది. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ప్రభుత్వం పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాల బదలాయింపులో చిత్తశుద్ధి కనబర్చాలి. స్థానిక సంస్థలపై ప్రభుత్వ, రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా పని చేసుకోనివ్వాలి. రిజర్వేషన్ల ద్వారా పదవుల్లోకొచ్చిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళలను తమ పని తాము చేసుకునే వాతావరణం కల్పించాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి, స్థానిక సంస్థల పరిపుష్టికి, సామాజిక న్యాయానికి అర్ధం పరమార్ధం.