Sep 02,2023 21:06

సుపర్‌ స్పిన్నింగ్‌ మిల్లు

         హిందూపురం : పరిశ్రమల పేరుతో తీసుకున్న భూముల్లో వెంచర్లు వెలుస్తున్నాయి... నష్టాల పేరుతో పరిశ్రమలను మూసివేస్తూ, పేద రైతులు ఇచ్చిన భూములతో పారిశ్రామికవేత్తలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజవకర్గంలో పలు పారిశ్రామికవాడలు ఉన్నాయి. పరిశ్రమలు వస్తే తమ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని... ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెంది జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశతో హిందూపురం నియోజకవర్గం ప్రాంతంలో కారుచౌకగ వందలాది ఎకరాలను రైతులు అతి తక్కువ ధరకే పొలాలను ఇచ్చేశారు. ఇలా వచ్చిన పరిశ్రమల్లో ఈ ప్రాంత యువత తక్కువ వేతనాలకే కార్మికులుగా మారారు. ఈ యువత యాజమాన్యాల సంపద పోగుపడటానికి ఉపయోగపడ్డారు తప్పా, వారి జీవితాలు మాత్రం మారలేదు. కారుచౌకగ భూములు, శ్రామికశక్తి లభించడం, ప్రభుత్వల ప్రోత్సహకాలను పొందడం ఇలా అన్ని విధాల వసతులనూ ఉపయోగించుకున్న పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం వారి అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రాడంతో వాటిని సొమ్ముగా చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. నష్టాలను చూపించి ఏకంగా పరిశ్రమలనే మూసివేస్తున్నారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను రియల్టర్లకు కోట్లాది రూపాయాలకు విక్రయించి అందులో వెంచర్లను వేసేస్తున్నారు. పరిశ్రమల కోసం సాగులో ఉన్న భూములను ఇచ్చిన రైతులు మాత్రం సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పారిశ్రామికవాడను ప్రారంభించక ముందే కిరికెర సమీపంలో 1962లోనే తమిళనాడు రాష్ట్రానికి చెందిన బాలకృష్ణన్‌ సుపర్‌-ఏ స్పిన్నింగ్‌ మిల్లును ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వందలాది మందికి ఉపాధి కల్పించారు. కాలక్రమేణ 1630 మంది కార్మికుల వరకు అందులో ఉపాధి పొందారు. కొద్ది సంవత్సరాలకే సుపర్‌ స్పిన్నింగ్‌ ఏ మిల్లు యాజమాన్యానికి కోట్లాది రూపాయల ఆదాయం చేకూరింది. వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగునిచ్చి, ఉపాధి కల్పించిన కల్పతరువుగా సూపర్‌ ఏ స్పిన్నింగ్‌ మిల్లు మారింది. ఈ పరిశ్రమ లాభాలతో అనేక ఇతర పరిశ్రమలు, విద్యా సంస్థలను ప్రారంభించింది. 1983వ సంవత్సరంలో కొట్నూరు సమీపంలో సుపర్‌-బి, పరిగి మండలం గోర్రపల్లి వద్ద ప్రీకాట్‌ మెడిరీయన్‌ స్పిన్నింగ్‌ మిల్లులను ప్రారంభించారు. దీంతో పాటు కిరికెర వద్ద ఎల్‌ఆర్‌జి పేరుతో పాఠశాల, కళశాలలనూ ప్రారంభించారు. విద్యాసంస్థలు కూడా బాగా అభివృద్ధి చెందడంతో గత రెండూ సంవత్సరాల క్రితం మరో విద్యాసంస్థను ప్రారంభించారు. 2011లో గోరంట్ల రోడ్డులో సుపర్‌ సారా పేరుతో మిల్లును ప్రారంభించారు. ఇలా ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెరిగి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కల్పతరువుగా సుపర్‌ స్పిన్నింగ్‌ మిల్లు నిలిచింది. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఎన్‌జి బాలకృష్ణన్‌ మరణాంతరం కార్మికులు వారి సొంత నిధులతో పట్టణంలో ప్రధాన కూడలిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
రాత్రికి రాత్రే యంత్రాల తరలింపు...
బాకృష్ణన్‌ మరణం తరువాత సూపర్‌ స్పిన్నింగ్‌ మిల్లు పరిశ్రమ నిర్వహణలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న యాజమాన్యం కార్మికుల పొట్టగొట్టి ప్రభుత్వం, కార్మిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాత్రికిరాత్రే పరిశ్రమలో ఉన్న యంత్రాలను తరలించేసింది. పరిశ్రమ భూములను రియల్టర్లకు విక్రయించారు. దీంతో ఇప్పటికే కిరికెర వద్ద పరిశ్రమ భూమిలో వెంచర్లు వెలిశాయి. 2011లో ప్రారంభించిన సుపర్‌ సారా మిల్లు స్థలాన్ని వేరే పరిశ్రమకు లీజుకు ఇచ్చారు. ప్రస్తుతం సుపర్‌-బి మిల్లు మూసివేశారు. ఈ స్థలాన్ని రియల్టర్లకు విక్రయిస్తారా...?, ఎవైన పరిశ్రమలకు లీజుకు ఇస్తారా...? అన్న విషయం యాజమాన్యం నిర్ణయంపై ఆధారపడి ఉంది. పరిశ్రమలు, స్థానిక యువత ఉపాధిపై, దృష్టి సారించాల్సిన పాలకులు, ప్రజా ప్రతినిధులు వీటి గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా మిన్నకుండిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నూతన పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామంటూ తరచూ చెబుతున్న సమయంలో ఉన్న పరిశ్రమలు మూతబడుతున్నా స్థానిక నేతల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.
పథకం ప్రకారం కార్మికుల సంఖ్య తగ్గింపు
యాజమాన్యం పరిశ్రమలను మూసి వేయాలని ఒక పథకం ప్రకారం కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. సుపర్‌-బి మిల్లులో దాదాపు 1600 మంది కార్మికులు పని చేస్తుంటే కార్మికులపై భారీగా పనిఒత్తిడి పెంచింది. నిబంధనల మేరకు పరిశ్రమలో కార్మికులకు స్వేచ్ఛాయుత వాతవరణాన్ని కల్పించాల్సిన యాజమాన్యం కార్మికులను వేధిస్తూ ఇచ్చిన వేతనాల్లో సెక్యూరిటీ డిపాజిట్‌ పేరుతో తీసుకోవడం, పని ఒత్తిడి పెంచి, పని చేయలేదని రూ.1000 అపరాధ రుసం విధించడం లాంటివి చేసి కార్మికుల సంఖ్యను తగ్గించింది. మరికొంత మందికి విఆర్‌ఎస్‌ ప్రకటించి ఇంటికి పంపారు. చివరకు పరిశ్రమ మూసివేసే సమయంలో కేవలం 76 మంది మాత్రమే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుపర్‌-ఏ మిల్లు కార్మికులకు మాత్రం ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారమూ ఇవ్వలేదు. తమకు న్యాయం చేయాలని కార్మికులు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెంచ్‌ సైతం కార్మికులకు న్యాయం చేయాలని తీర్పును వెలువరించినట్లు తెలుస్తోంది. అనంతపురం కార్మిక శాఖ కోర్టులో మాత్రం ఇంత వరకు ఈ కేసు పరిష్కారం కాలేదు. ఇలా పురం పారిశ్రామిక వాడలో ఒక్కో పరిశ్రమ మూత వేస్తూ, ఆ భూములను అమ్మేసుకునే కుట్రలు జరుగుతున్నాయి. దీనిపై ప్రజాప్రతినిధులు స్పందించి తప్పని సరి పరిస్థితుల్లో పరిశ్రమలు మూసి వేయాల్సి వస్తే ఆ భూములను సంబంధిత పేద రైతులకు వెనక్కు ఇచ్చేయాలని స్థానికులు కోరుతున్నారు.