Jul 29,2023 21:19

పరిశ్రమలు ఎక్కడ ? భూములు ఎవరికి ?

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ఎద్దు ఈనిందంటే ఇల్లవతల కట్టేయమన్నాడట వెనుకటి ఓ వ్యక్తి. కానీ, మన జిల్లా ప్రజానీకం అటువంటి మొద్దులు కాదు సుమా..! కాస్తాంత సౌమ్యంగా, సున్నితంగా వ్యవహరిస్తున్నా ఆలోచనలో మరీ అంత వెనుకబడిపోలేదు. నిన్నగాక మొన్న జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యాన జరిగిన పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంపై ప్రజలు స్పందిస్తున్న తీరే ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఆ సమావేశంలో అధికారుల నిర్ణయాలు, ఉన్నతాధికారి ఆదేశాలు కోటలు దాటుతున్నా ఆచరణలో కనిపించక పోవడంతో ఒకిన్ని అనుమానాలు, ఆశ్చర్యాలు వ్యక్తమౌతున్నాయి. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపు చేయడంలో జాప్యం జరగడానికి వీల్లేదని కలెక్టర్‌ ఆదేశించారు. కానీ, ఆ పరిశ్రమలు ఎక్కడీ ఎవరు? ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు? ముడిసరుకు మేమిటి? ఉత్పత్తులు ఏమిటి? మార్కెటింగ్‌ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎగుమతులు, దిగుమతులు ఉంటాయా? వాటి వల్ల జిల్లాకు ఒనగూరేదెంత ఉంటుంది? ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి కల్పన ఏమేరకు ఉంటుంది? అన్నది జిల్లాలో చాలా మంది చర్చిస్తున్న అంశం. ఇందుకు కారణం లేకపోలేదు. జిల్లా పారిశ్రామిక రంగంలో అత్యంత వెనుకబడి ఉంది. జిల్లా వార్షిక ఆదాయం రూ.35,385 కోట్లు కాగా, పరిశ్రమల ద్వారా వస్తున్న ఆదాయం కేవలం రూ.4,520కోట్లు (13.91శాతం) మాత్రమే. ఇంకా లోతుగా పరిశీలిస్తే గడిచిన ఐదేళ్లగా ఈ ఆదాయం తగ్గుతూ వస్తోంది. దీనికితోడు ఇటీవల జ్యూట్‌, ఫెర్రో ఎల్లాయీస్‌, చెక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. దీంతో, గడిచిన పదేళ్లలో సుమారు 30వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. జిల్లా నుంచి వలసలు కూడా ఎక్కువేనన్నది వేరేగా చెప్పనక్కర్లేదు. విటి అగ్రహరం, సారిపల్లి, కంటకాపల్లి, బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో కొన్ని దశాబ్థాల క్రితమే కేటాయించిన భూములు ఖాళీగానే ఉన్నాయి. ఆయా చోట్ల ఏర్పాటు చేసిన చాలాపరిశ్రమలు కూడా మూతపడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాకు పరిశ్రమ వస్తుందంటే లక్షల కుటుంబాలు ఆసక్తిగా ఎదురు చూస్తాయి. చూస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలో జిల్లాకు రాబోతున్న పరిశ్రమలు, ఉత్పత్తి, ఉత్పాదకత, వనరులు, ఇతర అవకాశాల గురించి ప్రస్తావన లేకుండా కేవలం భూముల కేటాయింపుపైనా, భద్రతా ప్రమాణాలపైనా చర్చించడం హాస్యాస్పదంగా ఉంది. జిల్లాకు రాబోతున్న యూనిట్లు, వాటి యజమానులు, వారికి కేటాయిస్తున్న భూముల గురించి కనీసం మీడియాకు విడుదల చేసిన ప్రకటనల్లో కూడా ఆయా ఆంశాలు లేకపోవడం గమనార్హం. దీన్నిబట్టి పరిశ్రమలన్నీ ఉత్తుత్తివేనని, కాగితాల్లో లెక్కలు మాత్రమేనని, భూములు ఎవరికో కట్టబెట్టడానికే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని జనం బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.