Aug 07,2023 00:10

మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రాము

ప్రజాశక్తి-అనకాపల్లి
పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు 70 శాతం ఉద్యోగాలు కల్పించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనకాపల్లి దొడ్డి రామునాయుడు కార్మిక, కర్షక భవన్‌లో ఆదివారం జరిగిన డివైఎఫ్‌ఐ జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు స్థానిక పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ నీటిమూటగానే మిగిలిపోయిందన్నారు. జిల్లాలో ఎస్‌ఇజెడ్‌, ఫార్మా, ఇతర కంపెనీల్లో నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి కల్పించడంలేదన్నారు. కల్పించిన ఉపాధి కూడా అత్యంత దయనీయమైన తక్కువ జీతాలు వచ్చే వాచ్‌మన్లు, తోటమాలి వంటి పనులు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతియేటా ఇయర్‌ క్యాలెండర్‌ వేసి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులకు వైసిపి ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. ప్రభుత్వ శాఖలు, గ్రామ, వార్డు సచివాలయాల ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ప్రతీయేటా డిఎస్‌సి నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన హామీ కూడా నెరవేరలేదని గుర్తు చేశారు. వెంటనే పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతరం డివైఎఫ్‌ఐ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. 12 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నికైంది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా సిహెచ్‌.శివాజీ, ఎస్‌వి.నాయుడు, ఉపాధ్యక్షులుగా అల్లు రాజు, సహాయ కార్యదర్శులుగా ఎన్‌.నారాయణరావు, శివ ఎన్నికయ్యారు.