Dec 13,2022 22:20

ప్రజాశక్తి - ద్వారకాతిరుమల
         పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పాటించాలని కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ ఆయా యాజమాన్యాలను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పి.కన్నాపురం సర్వారాయ సుగర్స్‌ బాటిలింగ్‌ యూనిట్‌ను జిల్లా పరిశ్రమల భద్రత పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్‌, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, ఇండిస్టీయల్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్‌ కమిటీ బృందంతో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రత చాలా ముఖ్యమని, ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు జిఒ 79 ప్రకారం పరిశ్రమల భద్రత, మార్గదర్శకాలను ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఖచ్చితంగా పాటించి అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని డబ్ల్యూటిపి యూనిట్‌, పవర్‌ యూనిట్‌, మైక్రోల్యాబ్‌, టెస్టింగ్‌ ల్యాబ్‌, బాయిలర్‌, ఎఐఆర్‌ కంప్రెషర్‌, చిల్లింగ్‌ ఎక్యూప్‌మెంట్‌, ఇటిపి ప్లాంట్‌, వేర్‌ హౌస్‌, స్టోరేజ్‌ రూమ్‌, కోకో కోలా బాటిలింగ్‌ మిషన్‌ ద్వారా టెస్టింగ్‌ చేయించి పరిశీలించారు. అలాగే ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన భద్రతకు సంబంధిత పరికరాలను, ఔషధాలను, ప్రమాదాల బోర్డులను, క్లీన్‌అండ్‌గ్రీన్‌ తనిఖీ చేశారు. అనంతరం ఫ్యాక్టరీకి సంబంధించిన అధికారుల కమిటీ బృందంతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఇటీవల కొన్ని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తినష్టం సంభవిస్తుందని, ఈ దృష్ట్యా వీటి నివారణకు చర్యలు తీసుకునే క్రమంలో ఆగస్టులో 79 జిఒ విడుదల చేశారన్నారు. ఈ జిఒ ప్రకారం జిల్లాలో పరిశ్రమల భద్రతా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీలో ఛైర్మన్‌గా కలెక్టర్‌, కమిటీ సభ్యులుగా డిసిఐఎఫ్‌, పొల్యూషన్‌ ఇఇ, జిఎం డిఐసి, డిసిఎల్‌ సభ్యులుగా ఉన్నారని, వీరి ద్వారా ఫ్యాక్టరీల భద్రత అమలుపై తనిఖీ చేస్తామని, ఈ నివేదికను ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్‌ తెలిపారు. ఏలూరు జిల్లాలో 28 ఫ్యాక్టరీలకు గాను ఇప్పటి వరకూ 16 ఫ్యాక్టరీల భద్రతా చర్యలను పరిశీలించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి ప్రమాదాలకు గురైన ఫ్యాక్టరీ యాజమాన్యంపై పరిశ్రమల చట్టం ప్రకారం చర్యలుంటాయని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు భీమడోలులో ట్రోమ్‌ సెంటర్‌ ఏర్పాటు, ఏలూరులో మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహకారంతో ప్లాస్టిక్‌ రీ సైక్లింగ్‌ యూనిట్‌, పి.కన్నాపురంలో కంపోస్ట్‌ యార్డ్‌ ఏర్పాటుకు యూనిట్‌ బృందం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి ఇఇ కెవి.రావు, కోకాకోలా బాటిలింగ్‌ యూనిట్‌ 2017లో ఏర్పాటు చేశారని 70 ఎకరాల్లోయూనిట్‌ కలిగిఉందని, త్వరలో రెండో యూనిట్‌ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్‌కు వివరించారు.
ఫ్యాక్టరీలో పరిశుభ్రత, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌, యూనిట్ల నిర్వహణతీరును పరిశీలించిన కలెక్టర్‌ సంతీప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో సర్పంచి దాసరి రాంబాబు, డిసిఐఎఫ్‌ఆర్‌.త్రినాథ్‌రావు, జిఎం డిఐసి పి.ఏసుదాసు, డిసిఎల్‌ కె.వసంతరావు, ఫ్యాక్టరీ మేనేజర్‌ జివివి.సత్యనారాయణ, క్వాలిటీ మేనేజరు ఎన్‌.శ్రీనివాసరావు, పర్సనల్‌ ఆఫీసరు ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.