Aug 25,2023 23:40

గుంటూరు: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహనకు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించాలని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి పరిశ్రమలు, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలక్టరేట్‌లో జిల్లా ఇండిస్టియల్‌ ఎక్స్పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ (డీఐఈపీసీ) సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అందించిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత సమయంలో పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌లో వున్న దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహకాలకు సంబంధించి 59 క్లైయిమ్స్‌కు రూ.7,18,83,225లు మంజూరు చేస్తూ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఆమోదించారు. సమావేశంలో ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మీ , జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ విజయ రత్నం, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ వి.గోపికృష్ణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


బడి ఈడు పిల్లల్ని పాఠశాలల్లో చేర్చించాలి
జిల్లాలో 5 నుంచి 18 ఎళ్ళ వయస్సు కలిగిన పిల్లల నమోదు నూరుశాతం పూర్తి అయ్యేలా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎడ్యుకేషన్‌ సెక్రెటరీలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్రాస్‌ ఎన్‌రోల్‌ మెంట్‌ రేషియో, హౌసింగ్‌, ఇతర అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సర్వే నేటి సాయంత్రానికి పూర్తి అయ్యేలా పర్యవేక్షించాలన్నారు. తెనాలి మండలంలో సర్వే నూరు శాతం పూర్తి అయ్యిందని తెలియజేస్తూ, ఇందుకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. నమోదు కాని వారందర్నీ గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అలాగే బడి మానేసిన పిల్లల తల్లిదండ్రులతో ఎంఈవోలు, ఎంపీడీవోలు, మండల స్థాయి ప్రత్యేక అధికారులు స్వయంగా వెళ్ళి మాట్లాడి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, తిరిగి పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రక్తహీనత ఉన్న విధ్యార్ధులు పాఠశాలలో రాగి జావా, మధ్యహ్నా భోజనం, కోడిగుడ్లు ఖచ్చితంగా తీసుకునేలా హెచ్‌ఎంల ద్వారా కృషి చేయాలన్నారు. నాడు- నేడు ద్వారా పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సౌకర్యాల పనులు వెంటనే పూర్తి అయ్యేలా చూడాలన్నారు. పేదలందరికీ ఇళ్ళ పథకంలో ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేసి, పలు చేశారు. సమావేశంలో డిఇఒ పి.శైలజ, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, జెడ్పీ సిఇఒ మోహనరావు పాల్గొన్నారు.