* రూ.1170 కోట్లతో నాలుగు భారీ, మధ్యతరహా పరిశ్రమలు
* నెలాఖరు నాటికి ఉద్దానం గ్రామాలకు రక్షిత మంచినీరు
* డిసెంబర్ నాటికి వంశధార హైలెవెల్ కెనాల్ పనులు పూర్తి
* 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి / అర్బన్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహం కల్పిస్తోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన పెరేడ్‌లో సాయుధ దళాలు, పోలీసులు, ఎన్‌సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల ప్రగతిని సూచించే శకటాలను తిలకించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ వలసల నివారణ, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రూ.1170 కోట్ల పెట్టుబడితో నాలుగు భారీ, మధ్యతరహా పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వీటి నిర్మాణం పూర్తయితే 1500 మందికి జిల్లాలో ఉపాధి లభిస్తుందన్నారు. 2022-23 సంవత్సరంలో రూ.292.61 కోట్లతో 2,988 పరిశ్రమలు ఏర్పాటు చేసి 13,651 మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.112.22 కోట్ల రూపాయల పెట్టుబడితో 862 ఎంఎస్‌ఎంఇలు ఏర్పాటు చేసి 3,505 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు.
ఖరీఫ్‌లో 8 లక్షల టన్నుల ధాన్యం అంచనా
రైతు భరోసా కేంద్రాల ద్వారా ఖరీఫ్‌లో ఇప్పటివరకు 34,174 క్వింటాళ్ల విత్తనాలను రూ.4.01 కోట్ల రాయితీపై రైతులకు పంపిణీ చేశామని, 15,810 మెట్రిక్ టన్నుల ఎరువులను అందించామని తెలిపారు. 2022-23లో 618 రైతుభరోసా కేంద్రాల ద్వారా 5,40,850 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామని, రాష్ట్రస్థాయిలో స్థాయిలో ధాన్యం కొనుగోలులో జిల్లా రెండో స్థానంలో నిలిచినందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, వ్యవసాయాధికారులు, సివిల్ సప్లర్సు అధికారులను అభినందించారు. ఈ ఖరీఫ్‌లో సుమారు ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశామని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
డిసెంబరు నాటికి వంశధార హైలెవల్ కెనాల్ పనులు పూర్తి
జిల్లాలో పుష్కలంగా ఉన్న జలవనరులను వినియోగించుకోవడం ద్వారా ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన వంశధార హైలెవల్ కెనాల్, ఆఫ్‌షోర్ తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో చేర్చామని చెప్పారు. వంశధార ప్రాజెక్టు పనులు 92 శాతం, వంశధార, నాగావళి నదుల అనుసంధానం (హైలెవల్ కెనాల్) పనులు 80 శాతం చేశామని తెలిపారు. హిరమండలం రిజర్వాయర్, హైలెవల్ కెనాల్ పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేసి ప్రారంభించనున్నామని తెలిపారు.
నెలాఖరుకు ఉద్దానం గ్రామాలకు తాగునీరు
ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.700 కోట్లతో పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. పథకం పూర్తి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఏడు మండలాల పరిధిలోని 807 గ్రామాలకు రక్షిత తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశామని తెలిపారు. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించామని, ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
ఏడాదిలోగా అందుబాటులోకి కిడ్నీ రీసెర్చ్ సెంటర్
పలాసలో రూ.50 కోట్లతో కిడ్నీ పరిశోధనా కేంద్రం, డయాలసిస్ యూనిట్లను నిర్మిస్తున్నామని, పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. జిల్లాలో 535 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలకు రూ.93.62 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. పిహెచ్‌సిల ఫేజ్-1లో భాగంగా 9 కొత్త భవనాలకు రూ.16.32 కోట్లు, ఫేజ్-2లో ఐదు పిహెచ్‌సిలకు రూ.11.80 కోట్ల మంజూరు చేశామని, ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు. వీటితోపాటు 57 పిహెచ్‌సిల పటిష్ట మరమ్మతులకు రూ.23 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆధునీకరణకు రూ.150 కోట్లు, వైద్య కళాశాల అప్‌గ్రేడ్‌కు రూ.60 కోట్లను మంజూరు చేశామన్నారు.
త్వరలో ఫిషింగ్ హార్బర్ పనులు
ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్రతీరంలో రూ.365.81 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఫిషింగ్ హార్బర్ పనుల డిజైన్ ప్రక్రియ జరగుతోందని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నిర్మాణం పూర్తయితే 3,840 మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ళపేట వద్ద రూ.14 కోట్లతో ఫిషింగ్ జెట్టీల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.
సమర్థవంతంగా 'ఉపాధి' అమలు
జిల్లాలో ఉపాధి హామీ కింద పెద్దఎత్తున పనులను చేపడుతున్నామని వెల్లడించారు. 2023-24లో కూలీలకు పనిదినాలు కల్పించడంతో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 3.22 లక్షల కుటుంబాలకు పనుల కల్పనలో, ఈనెల 8వ తేదీ వరకు రూ.497.33 కోట్లు ఖర్చు చేసి ఉపాధి నిధుల వినియోగంలో రాష్ట్రంలో జిల్లా ప్రధమ స్థానంలో నిలిచిందని చెప్పారు
జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు
జల జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో 5,38,658 గృహాలకు తాగునీరందించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఇప్పటివరకు 1,70,354 ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించామని చెప్పారు. 2,254 గ్రామాలకు రూ.477.76 కోట్లు మంజూరు చేశామని, రెండో దశలో 2,539 పనులకు రూ.1024.46 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. 784 జగనన్న హౌసింగ్ కాలనీలకు రూ.103.46 కోట్లు, గడప గడపకు మన ప్రభుత్వంలో రూ.18.02 కోట్లు చేశామని చెప్పారు జిల్లాకు 75,840 గృహాలు మంజూరు కాగా ఇప్పటివరకు 69,935 గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, రాష్ట్రస్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచిందన్నారు.
కోటబొమ్మాళి మండలం తిలారుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు అప్పలరామయ్య భార్య అప్పలనరసమ్మను ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్‌పి జి.ఆర్ రాధికతో కలిసి సత్కరించారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఒ మురళీకృష్ణ, ఆర్‌డిఒ బి.శాంతి, తూర్పుకాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, డిసిసిబి అధ్యక్షులు కె.రాజేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆహూతులను అలరించాయి. దేశభక్తిని ప్రతిబింబించేలా చిన్నారులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. త్రివర్ణ పతాకాన్ని వర్ణిస్తూ న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు నృత్యం చేసి మొదటి స్థానంలో నిలిచారు. గార కెజిబివి విద్యార్థులకు వందేమాతం గీతానికి ద్వితీయ బహుమతి, టిపిఎంహెచ్ స్కూల్ విద్యార్థులు శ్రీకాకుళం వైభవంపై ప్రదర్శనకు తృతీయ స్థానం లభిచింది. వారితోపాటు సంప్రదాయం గురుకులం, ఆర్‌సిఎం లయోల, లావేరు కెజిబివి, పెద్దపాడు బిఆర్ అంబేద్కర్ గురుకులం, ఐటిడిఎ పోస్ట్‌మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.
ఆకట్టుకున్న శకటాలు
జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసేలా పలు శాఖల ఆధ్వర్యాన 18 శకటాలను ప్రదర్శించారు. ఆ శాఖలకు చెందిన పథకాలకు సంబంధించిన ఆకృతులతో అలంకరించిన శకటాలు ఆకర్షణగా నిలిచాయి. పౌర సరఫరాల శాఖ శకటానికి ప్రథమ స్థానం, గృహ నిర్మాణశాఖ శకటానికి ద్వితీయ స్థానం, డిఆర్‌డిఎ శకటం తృతీయ స్థానం దక్కించుకున్నాయి.










